సంచలనం రేపుతున్న ట్రంప్‌ ఆడియో కాల్‌!

4 Jan, 2021 12:49 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా 46వ అధ్యక్షుడిగా డెమొక్రాట్‌ జో బైడెన్‌ పదవీ స్వీకార ప్రమాణానికి సమయం సమీపిస్తున్న వేళ డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. స్వింగ్‌ స్టేట్‌ జార్జియాలో తనకు అనుకూలంగా ఫలితాన్ని ప్రకటించాలంటూ, జార్జియా సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ బ్రాడ్‌ రాఫెన్స్పెర్జర్‌ను కోరారు. ఈ మేరకు వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో కాల్‌ సంచలనం రేపుతోంది. వాషింగ్టన్‌ పోస్టు ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. ఆడియో కాల్‌ ఆధారంగా.. తనకే ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పాలని, లేదంటే క్రిమినల్‌ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ తోటి రిపబ్లికన్‌ బ్రాడ్‌ను ట్రంప్‌ బెదిరించినట్లు తెలుస్తోంది. తనకు అనుకూలంగా వ్యవహరించకపోతే పెద్ద రిస్క్‌ తీసుకున్నవాడివి అవుతావంటూ తీవ్రస్థాయిలో ఆయనను హెచ్చరించారు. 

ఈ మేరకు.. ‘‘జార్జియా ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. దేశ ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అధ్యక్షుడికి వ్యతిరేకంగా మీరెలా పనిచేస్తారు. మీరు నాకోసం ఈ పని చేసి తీరాల్సిందే. నాకు 11,780 ఓట్లు వచ్చాయని చెప్పండి. నిజానికి మాకు అంతకంటే ఎక్కువ ఓట్లే వచ్చాయి. అక్కడ మేమే గెలిచాం. జార్జియాలో ఎట్టిపరిస్థితుల్లోనూ మేము ఓడిపోయే ప్రసక్తే లేదు. వందలు, వేల ఓట్ల మెజారిటీ వస్తుంది మాకు. నాకు వ్యతిరేకంగా మాట్లాడుతూ మీరు చాలా పెద్ద రిస్క్‌ తీసుకుంటున్నారు. మీరు, మీ లాయర్‌ రేయాన్‌ ఇందుకు క్రిమినల్‌ అఫెన్స్‌ ఎదుర్కోవాల్సి ఉంటుంది’’అని ట్రంప్‌ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. (చదవండి: ట్రంప్‌కు ఊహించని షాక్‌..!)

ధీటుగా బదులిచ్చిన బ్రాడ్
అయితే బ్రాడ్‌ మాత్రం ట్రంప్‌ వ్యాఖ్యలకు ధీటుగా బదులిచ్చారు. జార్జియాలో ఓట్ల లెక్కింపు పూర్తి పారదర్శకంగా జరిగిందని, జో బైడెన్‌ 11, 779 ఓట్లు సాధించారని, విజయం ఆయననే వరించిందని స్పష్టం చేశారు. ఇక ట్రంప్‌ చర్యపై డెమొక్రాట్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇది కచ్చితంగా అధికార దుర్వినియోగ చర్యే అని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇక అమెరికా ఉపాధ్యక్షురాలిగి ఎన్నికైన కమలా హారిస్‌ ఈ విషయంపై స్పందిస్తూ.. ‘‘ఆ గొంతు వింటే ఆయనకున్న అధికార దాహం ఎంతటిదో స్పష్టమవుతోంది. అమెరికా అధ్యక్షుడు ఇంత బాహాటంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు’’ అని మండిపడ్డారు. కాగా అధ్యక్ష ఎన్నికల్లో పరాజయం పాలైన  ట్రంప్‌ నేటికీ ఓటమిని అంగీకరించేందుకు సిద్ధంగా లేరు. ఫలితాలు వెలువడిన నాటి నుంచి, ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ డెమొక్రాట్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇక ఎలక్టోరల్‌ కాలేజీ ఎన్నికల్లో సైతం ఘన విజయం సాధించిన జో బైడెన్‌ జనవరి 20న అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సర్వం సిద్ధమవుతోంది. 

మరిన్ని వార్తలు