ఎలన్‌ మస్క్‌ తెలివైనోడు.. ట్విట్టర్‌ అతని చేతికి వెళ్లడం హ్యాపీగా ఉంది: ట్రంప్‌

29 Oct, 2022 19:07 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు, వ్యాపార దిగ్గజం డొనాల్డ్‌ ట్రంప్‌.. ట్విట్టర్‌ కొత్త ఓనర్‌ ఎలన్‌ మస్క్‌పై ప్రశంసలు గుప్పించాడు. మస్క్‌ తెలివైనోడంటూ వ్యాఖ్యలు చేశాడాయన. అయితే.. ట్విటర్‌ నిషేధం ఎదుర్కొంటున్న ట్రంప్‌.. తిరిగి చేరతారా? అనే సస్పెన్స్‌కు మాత్రం ఆయన ఫుల్‌స్టాప్‌ పెట్టలేదు. 

టెక్‌ బిలియనీర్‌ ఎలన్‌ మస్క్‌ సుమారు 44 బిలియన్‌ డాలర్లతో ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన వ్యవహారం హాట్‌ హాట్‌ చర్చకు దారి తీసింది. నెలల తరబడి ఊగిసలాట నడుమ ఎట్టకేలకు గురువారం రాత్రి ఈ డీల్‌ ముగిసింది. టేక్‌ ఓవర్‌ కంటే ముందే తన మార్క్‌ను చూపించుకునేందుకు మస్క్‌ చేస్తున్న ప్రయత్నాలపైనా జోరుగా చర్చ నడుస్తోంది. ఇక ఈ పరిణామంపై ట్రంప్‌ తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్రూత్‌ సోషల్‌లో స్పందించారు. 

మన దేశాన్ని(యూఎస్‌) నిజంగా ద్వేషించే రాడికల్ లెఫ్ట్ వెర్రితలలు, ఉన్మాదులు ఇకపై ట్విట్టర్‌ను నిర్వహించబోరు. ఆ ప్లాట్‌ఫామ్‌ ఇప్పుడు ఒక తెలివైన వ్యక్తి(ఎలన్‌ మస్క్‌) చేతుల్లోకి వెళ్లడం సంతోషాన్ని ఇచ్చింది అంటూ ట్రూత్‌ సోషల్‌లో ట్రంప్‌ పోస్ట్‌ చేశారు. ట్విట్టర్‌ నిషేధ సమయానికి ట్రంప్‌ ఖాతాకు 80 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు. అయితే సొంత సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫారం ట్రూత్‌ సోషల్‌లో మాత్రం ఇప్పటిదాకా నాలుగు మిలియన్‌ల ఫాలోవర్స్‌ మాత్రమే ఉండడం గమనార్హం. 


మస్క్‌తో ట్రంప్‌ (పాత చిత్రం)

ఇక ట్రంప్‌పై ట్విటర్‌ బ్యాన్‌ ఎత్తివేతకు సంకేతాలిస్తూ గతంలోనే కామెంట్లు చేశాడు ఎలన్‌ మస్క్‌. తానేం ట్రంప్‌ అభిమానిని కాదంటూనే.. మస్క్‌ నిషేధ నిర్ణయం సరికాదన్నారు. మరోవైపు ఫాక్స్‌ న్యూస్‌ డిజిటల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ట్రంప్‌ స్పందిస్తూ.. ట్విటర్‌ పునరాగమనంపై ఎటూ తేల్చలేదు. కాకపోతే తాను మస్క్‌ను బాగా ఇష్టపడతానని, అతనికి ట్విట్టర్‌ డీల్‌ అన్ని విధాల కలిసిరావాలని చెబుతూ శుభాకాంక్షలు తెలియజేశాడు. నేను లేకుండా ట్విట్టర్ విజయవంతం కాగలదని నేను అనుకోను అంటూ సరదా వ్యాఖ్య చేశారాయన. 

యూఎస్‌ కాపిటల్‌ దాడి నేపథ్యంలో ట్రంప్‌పై ట్విట్టర్‌ నిషేధం విధించింది. అయితే వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నట్లు ప్రకటించుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌.. తిరిగి ట్విట్టర్‌లోకి రావడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఆయన అభిమానులు.

మరిన్ని వార్తలు