నేను సూపర్‌ మ్యాన్‌ను: ట్రంప్‌

15 Oct, 2020 04:29 IST|Sakshi

కరోనా చికిత్స తర్వాత కొత్త శక్తి వచ్చిందన్న అమెరికా అధ్యక్షుడు

రోగ నిరోధకత పెరిగింది: ట్రంప్‌ జోరుగా ప్రచారం..

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ చికిత్స తీసుకున్నాక తనకి తానే ఒక సూపర్‌ మ్యాన్‌లా అనిపిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఆ చికిత్సతో రోగ నిరోధక శక్తి పెరిగి తనలో శక్తి బాగా పుంజుకుందని అన్నారు. కరోనా నెగెటివ్‌ వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయన పెన్సిల్వేనియా ఎన్నికల సభలో తన మద్దతుదారులనుద్దేశించి మాట్లాడారు. తనకు చికిత్స అందించిన వైద్యులకు ధన్యవాదాలు చెప్పారు.

‘‘కరోనా సోకిన తర్వాత నాకు ఇచ్చిన మందులు అద్భుతంగా పని చేశాయి. అవేవో యాంటీ బాడీస్‌ చికిత్స అనుకుంటాను. నాకు సరిగ్గా తెలీదు. అది తీసుకున్నాక నా ఆరోగ్యం చాలా మెరుగుపడింది. నాకు నేనే ఒక సూపర్‌ మ్యాన్‌లా అనిపిస్తున్నాను’’ అని ట్రంప్‌ చెప్పారు. ప్రపంచంలోనే అత్యుత్తమ వైద్యులు అమెరికాలో వాల్టర్‌ రీడ్‌ ఆస్పత్రిలో ఉన్నారని ఆయన కొనియాడారు. తనకు ఎంతటి శక్తి వచ్చిందంటే ఈ సభలో ఉన్న అందరినీ ముద్దాడగలనని అంటూ చమత్కరించారు.

ట్రంప్‌ క్వారంటైన్‌ సమయం ముగియ కుండానే బయటకి వచ్చారన్న విమర్శలకి ఆయన బదులిస్తూ ‘‘కావాలంటే నేను కూడా వైట్‌హౌస్‌లో ఒక మూల గదిలో కూర్చోవచ్చు. కానీ నేను అలా చెయ్యలేను. ఎందుకంటే నేను ఈ దేశానికి అధ్యక్షుడిని. నేను ప్రజల్ని కలుసుకోవాలి. వారితో మాట్లాడాలి. అందుకే నేను అలా శ్వేత సౌధానికే పరిమితమవలేకపోయాను’’ అని ఆ ఎన్నికల సభలో ట్రంప్‌ అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ కంటే ట్రంప్‌ బాగా వెనుకబడి ఉన్నారని సర్వేలు చెబుతూ ఉండడంతో ట్రంప్‌ ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహిస్తున్నారు.

బైడెన్‌కే ఇండో అమెరికన్లు జై
తాజా సర్వేలో మళ్లీ వెల్లడి  
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌కే భారతీయ అమెరికన్లు జై కొడుతున్నారని తాజా సర్వేలో మరోసారి వెల్లడైంది. ఇండో అమెరికన్‌ ఓటర్లలో 72శాతం మంది బైడెన్‌కి ఓటు వేయాలని భావిస్తుంటే, 22శాతం మంది అధ్యక్షుడు, రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌కి మద్దతుగా ఉన్నట్టుగా ఇండియన్‌ అమెరికన్‌ యాటిట్యూడ్స్‌ సర్వే (ఐఏఏఎస్‌)లో తేలింది. మరో మూడు శాతం మంది వేరే అభ్యర్థి వైపు మొగ్గు చూపిస్తే, మరో మూడు శాతం మంది ఓటు వెయ్యడానికి సుముఖత వ్యక్తం చేయలేదని ఆ సర్వే వెల్లడించింది.

ఇండియన్‌ అమెరికన్లు ఎప్పటి నుంచో డెమొక్రాట్లకే మద్దతుగా ఉన్నారు. ఈ సారి భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ డెమొక్రాటిక్‌ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉండడం, విదేశీ విధానంపై ట్రంప్‌ అనుసరిస్తున్న ఆందోళనలు వంటివి కూడా ప్రవాస భారతీయులు ఎక్కువగా జో బైడెన్‌ వైపు మొగ్గు చూపించడానికి దోహదం చేశాయని ఆ సర్వే వెల్లడించింది. సెప్టెంబర్‌ 1 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌ ద్వారా 936 మంది ఇండో అమెరికన్లతో ఈ సర్వే నిర్వహించింది.

మరిన్ని వార్తలు