జో బిడెన్‌పై ట్రంప్‌ విసుర్లు

12 Oct, 2020 08:59 IST|Sakshi

వాషింగ్టన్‌ : కోవిడ్‌-19 నుంచి తాను కోలుకున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. జో బిడెన్‌తో అధ్యక్ష పదవికి పోటీపడుతున్న ట్రంప్‌ తన ప్రచార పర్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు ముమ్మరం చేశారు. కరోనాను ఎదుర్కొనే  రోగ నిరోధక శక్తిని తాను కలిగిఉన్నానని, ఇది దీర్ఘకాలమా..పరిమిత కాలమా జీవితాంతం ఉంటుందా అనేది తనకు తెలియదని, వైరస్‌ను దీటుగా ఎదుర్కొన్నానని ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ స్పష్టం చేశారు.‘రోగ నిరోధక శక్తి కలిగిన అధ్యక్షుడు మీ ముందున్నారు..తన ప్రత్యర్థి మాదిరి బేస్‌మెంట్‌లో తలదాచుకోని అధ్యక్షుడు మీకున్నార’ని డెమొక్రాట్‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌పై ట్రంప్‌ విమర్శలు గుప్పించారు.

తన ప్రత్యర్థి జో బిడెన్‌ అస్వస్ధతకు లోనై ఉండవచ్చని ట్రంప్‌ పేర్కొన్నారు. జో బిడెన్‌ను నిశితంగా చూస్తే నిన్న ఆయన విపరీతంగా దగ్గుతున్నారని, ఆయనకు ఏమైందో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. కాగా అక్టోబర్‌ 1న ట్రంప్‌ కరోనా వైరస్‌ బారిన పడి ఆస్పత్రిలో మూడు రోజులు గడిపినప్పటి నుంచి జో బిడెన్‌ ప్రచారకర్తలు ఆయనకు నిర్వహించే కరోనా టెస్ట్‌ల వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తున్నారు. అయితే ట్రంప్‌ ఆరోగ్య పరిస్థితిపై మాత్రం రోజుకో వార్త గుప్పుమంటోంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత ట్రంప్‌నకు కరోనా పరీక్షలో నెగెటివ్‌ వచ్చిందా అనే దానిపై స్పష్టత లేదు. చదవండి : అధ్యక్ష అభ్యర్థుల ఖర్చు ఎంతో తెలుసా?

ట్రంప్‌ ఆరోగ్యంపై ఆయన ప్రచార బృందం, వైట్‌హస్‌ వైద్యులు పారదర్శకంగా వ్యవహరించలేదని భావిస్తున్నారు. మరోవైపు తనకు కరోనా వైరస్‌ సోకడంతో నిలిచిపోయిన ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టేందుకు ట్రంప్‌ సన్నద్ధమయ్యారు. నవంబర్‌ 3న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారాన్ని వేగవంతం చేసేందుకు ఈ వారం వరుస ర్యాలీలతో హోరెత్తించేందుకు ట్రంప్‌ ప్రచార బృందం ప్రణాళికలు రూపొందిస్తోంది. కాగా, ట్రంప్ సెంట్రల్ ఫ్లోరిడాలో సోమవారం క్యాంపెయిన్ చేపట్టనున్నారు. ఇక డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌తో రెండో అధ్యక్ష ఎన్నికల డిబేట్‌కు ట్రంప్ 'నో' చెప్పారు. దీంతో అక్టోబర్ 15న జరగాల్సిన ఈ డిబేట్ రద్దయింది. అధ్యక్ష ఎన్నికల డిబేట్‌లో చివరిదైన మూడో డిబేట్ అక్టోబర్ 22న జరగనుంది.

మరిన్ని వార్తలు