కమలా హారిస్‌పై ట్రంప్‌ తీవ్ర విమర్శలు

9 Oct, 2020 09:58 IST|Sakshi
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(ఫైల్‌ ఫొటో)

జో బైడెన్‌ గెలిస్తే రెండు నెలల్లో ఆయన నుంచి అధికారం లాక్కొంటారు: ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, డెమొక్రటిక్‌ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌పై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. ఆమె కమ్యూనిస్టు అని, చాలా భయంకరమైన వ్యక్తి అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒకవేళ 77 ఏళ్ల జో బైడెన్‌ గనుక అధ్యక్ష ఎన్నికల్లో గెలిచినట్లయితే, రెండు నెలలు తిరగకుండానే కమల ఆయన నుంచి అధికారాన్ని లాక్కొంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా బుధవారం నాటి వైస్‌ ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌ సందర్భంగా రిపబ్లికన్‌ మైక్‌ పెన్స్‌, డెమొక్రాట్‌ కమలా హారిస్‌ మధ్య వాడివేడి చర్చ జరిగింది. అమెరికాపై కోవిడ్‌ ప్రభావం, చైనాతో సంబంధాలు, వాతావరణ మార్పులు, సుప్రీంకోర్టు జడ్జి నియామకం, జాతివివక్ష తదితర అంశాలే ప్రధానంగా చర్చ సాగింది. ఈ క్రమంలో ట్రంప్‌ పాలనపై విమర్శనాస్త్రాలు సంధించిన కమల, గణాంకాలతో సహా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు. (చదవండి: ఇంతవరకు ఎవరికీ ఆ ఛాన్స్‌ రాలేదు!)

ఈ నేపథ్యంలో గురువారం ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘‘ గత రాత్రి జరిగింది అసలు చర్చలా అనిపించనే లేదు. ఆమె చాలా టెర్రిబుల్‌. ఇంతకంటే ఘోరంగా ఇంకెవరూ ఉండరు. అసలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఆమె ఒక కమ్యూనిస్టు. సెనెటర్‌ బెర్నే సాండర్స్‌కు ఆమె మద్దతుదారు. తనో కమ్యూనిస్టు. మనం కమ్యూనిస్టు పాలన చూడాల్సి వస్తుంది. మీకు తెలుసా, ఆరోజు జో పక్కన కూర్చున్నపుడు తనను గమనించాను. ప్రెసిడెంట్‌గా గెలిస్తే తను రెండు నెలలు కూడా పదవిలో ఉండడు. నా అభిప్రాయం ప్రకారం రెండంటే రెండు నెలలు కూడా అధ్యక్షుడిగా కొనసాగడు’’ అంటూ వ్యాఖ్యానించారు. (చదవండి: ట్రంప్‌ చెప్పిన‌ వ్యాక్సిన్‌‌ని తీసుకోను: కమల)‌

హంతకులు, రేపిస్టులకు సరిహద్దులు తెరుస్తారు!
ఇక కరోనాకు చికిత్స తీసుకుని శ్వేతసౌధానికి చేరుకున్న అనంతరం ఇచ్చిన తొలి ఇంటర్వ్యూలో కూడా ట్రంప్‌ ఇదే తరహాలో కమలపై విరుచుకుపడ్డారు. ఆమె సోషలిస్టు కాదని, హంతకులు, రేపిస్టులను దేశంలోకి అనమతించేలా సరిహద్దులు తెరుస్తానని చెబుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదే జరిగితే తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.

కాగా అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపికైన తొలి నల్లజాతి, ఆసియా- ఆఫ్రికా మూలాలున్న మహిళగా కమలా హారిస్‌ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. తొలుత అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడిన ఆమె, పార్టీ ప్రాథమిక ఎన్నికల్లో సరిపడా ఓట్లు రాకపోవడంతో బరిలో నుంచి తప్పుకొన్నారు. ఇక ఆ ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌ కమలను తన రన్నింగ్‌ మేట్‌గా నామినేట్‌ చేసి సరికొత్త చరిత్రకు నాంది పలికారు. ఈ క్రమంలో ట్రంప్‌, పలుమార్లు కమలను ఉద్దేశించి జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు.
 

మరిన్ని వార్తలు