బీరూట్‌ పేలుళ్ల ఘటనపై ట్రంప్‌ స్పందన

5 Aug, 2020 08:15 IST|Sakshi

వాషింగ్టన్‌: లెబనాన్ బీరూట్‌ పేలుళ్ల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విచారం వ్యక్తం చేశారు. కష్టకాలంలో లెబనాన్‌కు అమెరికా తోడుగా ఉంటుందని, ఎలాంటి సాయం చేయడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కాగా బీరూట్‌లో మంగళవారం సంభవించిన భారీ పేలుళ్ల కారణంగా 70 మందికి పైగా మృతిచెందగా.. 4 వేల మందికి గాయపడినట్లు లెబనాన్‌ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పోర్టు ఏరియాలో పేలుడు పదార్థాలు నిల్వ చేసే గోదాముల్లో ప్రమాదం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు.(బీరూట్‌ భారీ పేలుళ్లు, 70మంది మృతి)

ఈ విషయంపై స్పందించిన ట్రంప్‌.. డెబ్బై మందికి పైగా ప్రాణాలు బలిగొన్న ఈ ప్రమాదాన్ని‘భయంకరమైన దాడి’లా కనిపిస్తోందన్నారు ఇది పేలుడు పదార్థాల తయారీ వల్ల సంభవించలేదని, బాంబు దాడి అని భావిస్తున్నట్లు తెలిపారు. తన యంత్రాంగంలోని కొంతమంది అత్యుత్తమ జనరల్స్‌తో మాట్లాడానని, వారు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని విలేకరులతో పేర్కొన్నారు. కాగా గతంలో సీజ్‌ చేసిన ఓ పడవలోని పేలుడు పదార్థాలను పోర్టు ఏరియాలో నిల్వ చేయగా ప్రమాదం సంభవించినట్లు లెబనీస్‌ జనరల్‌ సెక్యూరిటీ చీఫ్‌ అబ్బాస్‌ ఇబ్రహీం స్వయంగా వెల్లడించిన తరుణంలో ట్రంప్‌ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఇక ఈ విచారకర ఘటనపై అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌ స్పందించారు. లెబనాన్‌ ప్రజల కోసం తాము ప్రార్థిస్తున్నామంటూ బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. (బీరూట్ బీభత్సం :  మహిళ సాహసం)

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వార్తలు