చైనాపై మరోసారి మండిపడ్డ ట్రంప్‌

22 Sep, 2020 21:26 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి చైనాపై విరుచుకుపడ్డారు. కరోనా వైరస్‌ను ప్రపంచం మీదకు వదిలిన డ్రాగన్‌ దేశంపై ఐక్యరాజ్యసమితి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రాణాంతక వైరస్‌ను వ్యాపింపజేసినందుకు చైనా బాధ్యత వహించేలా చూడాలన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఐరాస మంగళవారం చేపట్టిన వర్చువల్‌ మీటింగ్‌లో ట్రంప్‌ సహా ఇతర ప్రపంచ దేశాధినేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనాను మరోసారి చైనీస్‌ వైరస్‌ అని సంబోధించారు. ‘‘మనకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలంటే ప్రపంచం మీదకు ప్లేగును వదిలిన చైనాను జవాబుదారీగా చేయాలి’’ అని వ్యాఖ్యానించారు. (చదవండి: వీచాట్ బ్యాన్ : ట్రంప్ సర్కారుకు షాక్ )

ఈ విషయంలో చైనా ప్రభుత్వంతో పాటు, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించినందు వల్లే వైరస్‌ వ్యాప్తి చెందిందని ఆరోపించారు. కోవిడ్‌-19 గురించి అసత్య ప్రకటనలు చేసేలా చైనీస్‌ కమ్యూనిస్టు డబ్ల్యూహెచ్‌ఓను ప్రభావితం చేసిందని ఆరోపణలు చేశారు. ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో డొమెస్టిక్‌ విమానాలను రద్దు చేసి, తమ పౌరులను ఇళ్లల్లో బంధించిన చైనా, ఆ దేశ అంతర్జాతీయ విమానాలపై తాను నిషేధం విధించడాన్ని మాత్రం తీవ్రంగా ఖండించిందని, డ్రాగన్‌ ద్వంద్వ వైఖరికి ఇది నిదర్శనమని ట్రంప్‌ మండిపడ్డారు. కాగా కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు తొమ్మిదిన్నర లక్షలకు పైగా మందికి పైగా మరణించగా, 3 కోట్ల మందికి పైగా వైరస్‌ సోకింది. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు