పుతిన్‌కు నా తడాఖా చూపించేవాడిని.. ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు!

27 Apr, 2022 08:40 IST|Sakshi

సొంత దేశం తీరును తప్పుబట్టకుండానే.. రష్యాకు, ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు మద్ధతు వ్యాఖ్యలు చేస్తుంటాడు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన పుతిన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

రష్యాతో, పుతిన్‌తో అనుబంధం గురించి పియర్స్‌ మోర్గాన్‌ .. డొనాల్డ్‌ ట్రంప్‌పై ప్రశ్నల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో పుతిన్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పియర్స్‌ మోర్గాన్‌ అన్‌సెన్సార్డ్‌ పేరిట జరిగిన ఇంటర్వ్యూలో.. ‘‘ఒకవేళ అధ్యక్ష స్థానంలో ఉండి ఉంటే.. ఉక్రెయిన్‌ తాజా పరిణామాలపై ఎలా స్పందించేవార’’ని ట్రంప్‌ను పియర్స్‌ అడిగాడు. దానికి..  ట్రంప్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ఈ పరిణామాలను ఆధారంగా చేసుకుని పుతిన్‌పై విరుచుకుపడతానని చెప్పాడు. 

క్రెమ్లిన్‌ నేత(పుతిన్‌ను ఉద్దేశించి).. పదే పదే అణు అనే పదం ఉపయోగిస్తున్నాడు. నేనే గనుక అధ్యక్ష స్థానంలో ఉండి ఉంటే.. ఆ పదం వాడొద్దంటూ గట్టిగా హెచ్చరించేవాడిని. పుతిన్‌ ప్రతీరోజూ ఆ పదం వాడుతూనే ఉన్నాడు. అంతా భయపడుతున్నారు. ఆ భయాన్ని చూసి ఇంకా పదే పదే ఆ పదాన్నే రిపీట్‌ చేస్తున్నాడు. ఆ భయమే అతనికి ఆయుధంగా మారుతోంది. 

కానీ, అమెరికా దగ్గర అంతకంటే ఎక్కువే ఆయుధ సంపత్తి ఉంది. నీ కంటే మేం శక్తివంతమైన వాళ్లం. అది తెలుసుకో అని పుతిన్‌తో గట్టిగా చెప్పేవాడిని. ఒకవేళ తానే గనుక అధ్యక్షుడిని అయ్యి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేదని గట్టిగా హెచ్చరించేవాడిని, నా తడఖా చూపించేవాడిని అని ట్రంప్‌ పేర్కొన్నారు. 

అంతేకాదు.. ఉక్రెయిన్‌పై దాడిని ఆపకుంటే అమెరికా స్పందన ఎలా ఉంటుందో ఇంతకు ముందే రష్యా అధినేతకు చెప్పానని ట్రంప్ గుర్తు చేసుకున్నారు. దానికి అతను (పుతిన్) ప్రతిస్పందనగా ‘నిజంగానా?’ అని అడిగాడు.. ‘అవును నిజంగానే మిస్టర్‌’ అని బదులిచ్చా అని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. వివాదాస్పదమైన అంశాల ప్రస్తావనతో ఈ ఇంటర్వ్యూ సంచలనాత్మకంగా మారింది ఇప్పుడు. ఎన్నికల అబద్ధాలకు సంబంధించిన ప్రశ్నలు ట్రంప్‌కు ఎదురుకాగా.. ఆయన మధ్యలో వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే ట్రంప్‌ మాత్రం ఇదొక కుట్ర పూరితమైన ఇంటర్వ్యూ అంటూ ఆరోపించారు.

మరిన్ని వార్తలు