ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడానికి ట్రంప్‌ కుట్రలు

3 Sep, 2022 05:01 IST|Sakshi

ఆయన ఆటలు సాగనివ్వం: బైడెన్‌

వాషింగ్టన్‌:  అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడానికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఆయన మద్దతుదారులు కుట్రలు పన్నుతున్నారని అధ్యక్షుడు జో బైడెన్‌ ఆరోపించారు. అధికారం దక్కించుకోవడానికి దుర్బుద్ధితో రాజకీయ హింసను ఎగదోస్తున్న వారికి గట్టిగా బుద్ధి చెప్పాలని, తగిన గుణపాఠం నేర్పాలని అమెరికా ప్రజలకు పిలుపునిచ్చారు. ‘తీవ్రవాదులను’ కచ్చితంగా ఎదిరించాలని చెప్పారు. ఫిలడెల్ఫియాలోని ప్రఖ్యాత ఇండిపెండెన్స్‌ హాల్‌లో బైడెన్‌ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

ప్రతిపక్ష రిపబ్లికన్లపై విరుచుకుపడ్డారు. ట్రంప్‌ మద్దతుదారుల అజెండా అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పేనని తేల్చిచెప్పారు. వారి దుశ్చర్యల వల్ల సమానత్వం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతున్నాయని పేర్కొన్నారు. వారికి రాజ్యాంగంపై నమ్మకం లేదని, అధికారమే పరమావధిగా భావిస్తున్నారని ధ్వజమెత్తారు. డొనాల్డ్‌ ట్రంప్, ఆయన అనుచరుల ఆటలు సాగవని హెచ్చరించారు. నాయకుడి పట్ల గుడ్డిగా విధేయత ప్రకటించడం, రాజకీయ హింసలో పాల్గొనడం వంటివి ప్రజాస్వామ్యానికి చేటు కలిగిస్తాయన్న సత్యాన్ని చరిత్ర మనకు నేర్పుతోందని బైడెన్‌ ఉద్ఘాటించారు.

మరిన్ని వార్తలు