అమెరికాలో అరాచకం

8 Jan, 2021 04:19 IST|Sakshi
క్యాపిటల్‌ భవనం ఎదుట ఆందోళనకు దిగిన డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుదారులు

క్యాపిటల్‌ భవనంపై దాడి

ట్రంప్‌ మద్దతుదారుల దురాగతం

గోడలు ఎక్కి, కిటికీ అద్దాలు పగులగొట్టి 

నాలుగు గంటల సేపు యుద్ధ వాతావరణం

ప్రాణభయంతో టేబుల్స్‌ కింద దాక్కున్న కాంగ్రెస్‌ సభ్యులు 

పోలీసు కాల్పుల్లో నలుగురు మృతి

వాషింగ్టన్‌లో 15 రోజులు ఎమర్జెన్సీ విధింపు 

ప్రజాస్వామ్యంపై దాడి అన్న బైడెన్‌

శాంతి మంత్రం వల్లించిన ట్రంప్‌  

అగ్రరాజ్యం వణికిపోయింది. ప్రజాస్వామ్యం చిన్నబోయింది. ప్రపంచదేశాలు నివ్వెరపోయాయి. ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని ట్రంప్‌ తన అనుచరుల్ని రెచ్చగొట్టారు. అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఎన్నికను అడ్డుకోవాలంటూ ఉసిగొల్పారు. ఫలితంగా అమెరికాకి గుండెకాయ వంటి చట్టసభల సమావేశ భవనం క్యాపిటల్‌పై దాడి జరిగింది. కనీవినీ ఎరుగని హింసాకాండ చెలరేగింది. అమెరికా చరిత్రలో చీకటి రోజుగా మిగిలింది. అదే రోజు రాత్రి ప్రజాస్వామ్యానికి కొత్త వెలుగులు ప్రసరించేలా కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఎన్నికను కాంగ్రెస్‌ ధ్రువీకరించింది. ఉపాధ్యక్షుడిని ప్రలోభపెట్టాలని చూసిన ట్రంప్‌ ఎత్తుగడలు ఫలించలేదు. చేసేదేమీలేక ట్రంప్‌ ఓటమిని అంగీకరించారు. ఈ మొత్తం ఘటనలో ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించిన ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ హీరోగా నిలిస్తే, ట్రంప్‌ అవమానభారంతో జీరోగా మిగిలి అందరి ముందు తలవంచుకోవాల్సి వచ్చింది.  

వాషింగ్టన్‌: అమెరికా చరిత్రలోనే కనీవినీ ఎరుగని అసాధారణ ఘటన ఇది. ప్రజాస్వామ్యానికే మాయని మచ్చలా మిగిలిపోయిన దుశ్చర్య ఇది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అండదండలతో ఆయన అనుచరులు అమెరికా చట్టసభల సమావేశ భవనం క్యాపిటల్‌పై బుధవారం దాడి చేశారు. ఆగ్రహావేశాలతో రెచ్చిపోయి హింసాకాండకు దిగారు. అమెరికా కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఎన్నికను ధ్రువీకరించడానికి కాంగ్రెస్‌ ఉభయసభలు సమావేశమైన సమయంలో వేలాది మంది ట్రంప్‌ మద్దతుదారులు అమెరికా జెండాలు చేతబూని వచ్చి ఆ ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

  ఆందోళనకారుల్ని నిలువరించడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగం, కాల్పులు జరపాల్సి వచ్చింది.  ఈ హింసాకాండ దాదాపు నాలుగు గంటల సేపు సాగింది. పోలీసుల కాల్పుల్లో ఒక మహిళ సహా నలుగురు మరణించారు. డజనుకి పైగా    పోలీసులు గాయపడ్డారు. పదుల సంఖ్యలో ఆందోళనకారుల్ని వాషింగ్టన్‌ మెట్రోపాలిటన్‌ చీఫ్‌ పోలీసు రాబర్ట్‌ జే కాంటీ వెల్లడించారు. జాతీయ భద్రతా బలగాలు రంగంలోకి దిగాక పరిస్థితులు అదుపులోనికి వచ్చాయి. వాషింగ్టన్‌ మేయర్‌ మురీల్‌ బౌజర్‌ తొలుత రాత్రి పూట కర్ఫ్యూ ప్రకటించారు. ఆ తర్వాత 15 రోజుల పాటు అత్యవసర పరిస్థితుల్ని విధించారు.  

ప్రజాస్వామ్యంపై దాడి : బైడెన్‌
ట్రంప్‌ అనుచరుల దాడి ఘటనపై కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమెరికా చరిత్రలో ఇదో చీకటి రోజు అని వ్యాఖ్యానించారు. ‘‘మన ప్రజాస్వామ్యంపై అసాధారణ స్థాయిలో దాడి జరిగింది.  ఈ ఆధునిక కాలంలో ఎప్పుడూ ఇలాంటి దాడిని మనం చూడలేదు. మన స్వేచ్ఛపైనా, మన ప్రజాప్రతినిధులపైనా, మనకి రక్షణ కల్పించే పోలీసులపైనా, ప్రభుత్వ ఉద్యోగులపైనా దాడి జరిగింది’ అని బైడెన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.  అయితే అసలు సిసలు అమెరికా ఇది కాదని బైడెన్‌ అన్నారు. ‘‘క్యాపిటల్‌ భవనం       దగ్గర జరిగిన భయానక దృశ్యాలు చూసి ఇదే     అసలైన అమెరికా అనుకుంటే పొరపాటు. తీవ్రవాద భావాలు కలిగిన కొందరు చట్టాన్ని తమ   చేతుల్లోకి తీసుకున్నారు. వారి సంఖ్య చాలా తక్కువ.  ఇలాంటి ఘటనలకు ఇంక తెరపడాలి’’ అని అన్నారు.  
శాంతియుతంగా

ప్రవర్తించాలంటూ ట్రంప్‌ వీడియో
డొనాల్డ్‌ ట్రంప్‌ తన మద్దతుదారుల్ని ప్రోత్సహిస్తూ క్యాపిటల్‌ భవనం దగ్గరకు వెళ్లండంటూ ట్వీట్లు పెట్టారు. ‘‘మీరు నింగీనేల ఏకమయ్యేలా పోరాడాలి. లేకపోతే మీకు మన దేశం దక్కదు’’, ‘‘బలహీనులెవరైనా ఉంటే బయటకు వచ్చేయండి బలవంతులకే ఇది సమయం’’ అని ట్వీట్లు చేశారు. ఎప్పుడైతే వారి దాడి హింసకు దారితీసిందో వెనక్కి తగ్గిన ఆయన శాంతి మంత్రం జపిస్తూ ఒక వీడియోని తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్టు చేశారు. ‘‘ఈ ఎన్నికల ప్రక్రియ అంతా తప్పులతడకే. కానీ మనమేమీ చెయ్యలేం. అందరం శాంతియుతంగా వ్యవహరిద్దాం. అందరూ ఇళ్లకు వెళ్లపోండి’’ అంటూ తన అనుచరగణానికి ఆ వీడియోలో విజ్ఞప్తి చేశారు.అయితే ట్విట్టర్‌ ట్రంప్‌ ప్రోత్సహిస్తూ పెట్టిన ట్వీట్లను ఆయన ఖాతానుంచి తొలగించింది. 12 గంటల సేపు ట్రంప్‌ ఖాతాని లాక్‌ చేసింది. ఫేస్‌బుక్‌ కూడా ట్రంప్‌ అకౌంట్‌ని 24 గంటలు పాటు బ్లాక్‌ చేసింది.  

4 గంటలు ఏం జరిగిందంటే...
క్యాపిటల్‌ భవనాన్ని ముట్టడించడానికి అనూహ్యంగా, ఒక వెల్లువలా వచ్చిన నిరసనకారుల్ని చూసి పోలీసులు తేరుకునే లోపు వారంతా బ్యారికేడ్లు దూకి క్యాపిటల్‌ భవనం లోపలికి దూసుకుపోయారు.  ట్రంప్‌ పేరున్న జెండాలు పట్టుకొని ఆయనకి అనుకూల నినాదాలు చేస్తూ సెనేట్‌ చాంబర్‌ అంతా కలియ తిరిగారు. కాంగ్రెస్‌ సభ్యుల్ని ఉద్దేశించి  ‘‘వాళ్లంతా ఎక్కడ’’ అని ట్రంప్‌ మద్దతుదారుడు ఒకరు తలుపులు దబదబా బాదుతూ హాలంతా తిరిగాడు. కొందరు కిటికీలు బద్దలు కొట్టారు. మరికొందరు రూఫ్‌లపైకి ఎక్కారు. నానా బీభత్సం సృష్టించారు.  దీంతో ప్రజాప్రతినిధులు, క్యాపిటల్‌ సిబ్బంది భయంతో వణికిపోయారు. కొందరు టేబుల్స్‌ కింద దాక్కున్నారు.

మరికొందరు మోకాళ్లలో తలదూర్చి ప్రార్థనలు చేశారు. ఇంతలో మరికొందరు ఆందోళనకారులు ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ చైర్‌ని ఆక్రమించారు. సెనేట్‌లో వేదిక ఎక్కి గోల గోల చేశారు. ‘ట్రంప్‌ ఎన్నికల్లో గెలిచారు’ అంటూ గట్టిగా కేకలు వేశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆందోళనకారులు ఆగలేదు. ముందుకు దూసుకువెళ్లారు. అప్పటికే కాంగ్రెస్‌ ఉభయసభల సమావేశానికి ఆధ్వర్యం వహిస్తున్న ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ కుర్చీలోంచి లేచి వెళ్లిపోయారు. మైక్‌ పెన్స్, ఇతర ప్రజాప్రతినిధుల్ని పోలీసులు రహస్య సొరంగ మార్గం ద్వారా అదే భవనంలోని సురక్షిత ప్రాంతానికి తరలించారు. క్యాపిటిల్‌ భవనానికి తాళాలు వేసి బాష్పవాయువును ప్రయోగించారు.  

క్యాపిటల్‌ భవనంలో కాల్పులు : మహిళ మృతి  
ట్రంప్‌ మద్దతుదారులు వెనక్కి తగ్గకపోవడంతో కేంద్ర భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. పోలీసులు, కేంద్ర బలగాలు క్యాపిటల్‌ భవనాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. పరిస్థితుల్ని అదుపులోకి తీసుకురావడానికి కాల్పులు కూడా జరిపారు. ఈ కాల్పుల్లో తొలుత అశిల్‌ బబ్బిత్‌ అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. తుపాకీ గుండు ఆమె ఛాతీలోకి దూసుకువెళ్లడంతో మరణించింది. అశిల్‌ అమెరికా వైమానిక దళంలో 14 ఏళ్లపాటు సేవలు అందించారు. ట్రంప్‌కి వీరాభిమాని అని ఆమె భర్త వెల్లడించారు.  దాడి జరగడానికి ముందు రోజు ఆమె తన ట్విట్టర్‌ అకౌంట్‌లో ‘‘మమ్మల్ని ఎవరూ ఆపలేరు. వాళ్లు ప్రయత్నిస్తారేమో కానీ తుఫాన్‌ మొదలైంది. 24 గంటల్లోనే వాషింగ్టన్‌ను చుట్టుముట్టేస్తుంది’’ అని ట్వీట్‌ చేశారు. అశిల్‌తో పాటు పోలీసు కాల్పుల్లో మరో ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారు.  

కావాలనే ఆందోళనకారుల్ని వదిలేశారా?
కాంగ్రెస్‌ ఉభయ సభలు సమావేశమైన క్యాపిటల్‌ భవనం దగ్గర భద్రతా సిబ్బంది చూసీ చూడనట్టుగా ఆందోళనకారుల్ని వదిలేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ హింసాకాండకి సంబంధించిన వీడియోలో ట్రంప్‌ మద్దతుదారులు హాయిగా నడుచుకుంటూ లోపలికి వెళ్లిన దృశ్యాలు కనిపించాయి. అప్పుడు వారిని అడ్డుకునే నాథుడే కనిపించలేదని సీఎన్‌ఎన్‌ చానల్‌ కథనాన్ని ప్రసారం చేసింది. బారికేడ్లు దాటుకుంటూ, కిటికీల్లోంచి దూరుతూ, గోడలు ఎక్కి ట్రంప్‌ మద్దతుదారులు నానా రచ్చ చేశారు. ‘‘ట్రంప్‌ మద్దతుదారులు దాడి చేస్తారని పోలీసులకి తెలుసు. హింసాకాండ జరుగుతుందని వారి కి ముందే తెలుసు. అయినప్పటికీ భద్రతా ఏర్పాట్లు సరిగా చెయ్యలేదు. క్యాపిటల్‌ భవనం దగ్గర భద్రతా ఏర్పాట్లలో డొల్లతనం బయటపడింది’’ అని అమెరికా పోలీసు శాఖకి చెందిన మాజీ అధికారి తిమోతి డిమాఫ్‌ అన్నారు.  నేషనల్‌ గార్డ్స్‌ రంగంలోకి దిగిన తర్వాతే పరిస్థితులు అదుపులోనికి వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

క్యాపిటల్‌ భవనం గోడ ఎక్కుతున్న ట్రంప్‌ మద్దతుదారులు  


క్యాపిటల్‌ భవనంపై నుంచి ఆందోళనకారులపైకి తుపాకులు గురిపెట్టిన పోలీసులు

మరిన్ని వార్తలు