అప్పుల ఊబిలో డొనాల్డ్‌ ట్రంప్‌..? 

1 Feb, 2021 10:46 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష పదవి నుంచి ఇటీవల దిగిపోయిన డొనాల్డ్‌ ట్రంప్‌ అప్పుల ఊబిలో కూరుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లోకి రాకముందు వ్యాపారాల్లో మునిగితేలిన ట్రంప్‌ అధ్యక్షుడు అయిన తర్వాత కూడా ఫక్తు వ్యాపారవేత్తగానే ప్రవర్తించారు. అయితే దాదాపు వంద కోట్ల డాలర్ల (సుమారు 7,300 కోట్ల రూపాయలు) మేర అప్పుల్లో ఉన్న ట్రంప్‌ వ్యాపార సామ్రాజ్యాన్ని రుణవిముక్తం చేయడం అంత ఈజీ కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా క్యాపిటల్‌ హిల్‌పై దాడి అనంతరం ఆయనపై విత్త సంస్థల దృక్పథంలో వచ్చిన మార్పు కారణంగా రుణ విముక్తి అంత తేలిగ్గా జరగకపోవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే పలు పెద్ద, చిన్నా బ్యాంకులు ట్రంప్‌తో, ఆయన కంపెనీలతో సంబంధాలు తెంచుకున్నాయి, కానీ డాయిష్‌ బ్యాంకు మాత్రం ఇంతవరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు.

తాజాగా ఈ బ్యాంకు సైతం ట్రంప్‌తో వ్యాపారానికి గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించింది. చివరకు చిన్న సైజు బ్యాంకైన సిగ్నేచర్‌ బ్యాంకు సైతం ట్రంప్‌వి, ఆయన కంపెనీలవి అకౌంట్లను క్లోజ్‌ చేస్తున్నట్లు తెలిపింది. దీంతో ఆయనకు బ్యాంకుల నుంచి రుణాలు పుట్టే అవకాశాలు మూసుకుపోయినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఉన్న ఆస్తులు అమ్మి గట్టెక్కాలని భావించినా, కుష్‌మన్‌ అండ్‌ వాక్‌ఫీల్డ్, జేఎల్‌ఎల్‌ లాంటి పలు బ్రోకరింగ్‌ దిగ్గజాలు సైతం ట్రంప్‌తో వ్యాపార బంధాలు తెంచుకున్నాయి. అందువల్ల ఆస్తుల అమ్మకాలు కూడా కష్టంగా మారే ఛాన్సులున్నాయి. పైగా ఆయన ఆస్తుల్లో ఎక్కువ భాగం డెమొక్రాట్లు బలంగా ఉన్న రాష్ట్రా ల్లో ఉన్నాయి. అందుకే ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ ఈ వ్యవహారాలపై ఎలాం టి ప్రకటనలు చేయడం లేదు.     

విదేశీ సాయం 
సొంత దేశంలో ట్రంప్‌నకు సాయం లభించడం కల్ల అని ఎక్కువమంది భావిస్తుండగా, కొందరు మాత్రం అధ్యక్షుడిగా ఇన్నాళ్లు పని చేయడం వల్ల వ్యాపార విస్తరణ అవకాశాలు పెరిగాయని, అందువల్ల స్వదేశంలో ఇబ్బందులు ఎదురైనా విదేశాల్లో పెట్టుబడులు, వ్యాపారాలు బాగా కొనసాగే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు. బ్రెజిల్, టర్కీ, ఫిలిప్పీన్స్, ఇండియాలాంటి దేశాల్లో ట్రంప్‌నకు ఇంకా పాపులారిటీ ఉందని, ఆయా దేశాల నేతలతో సత్సంబంధాలే ఉన్నాయని వీరు గుర్తు చేస్తున్నారు. అలాగే ఇటీవల కాలంలో పలు అరబ్‌ దేశాలతో ట్రంప్‌ టీమ్‌ మంచి సంబంధాలు నెలకొల్పుకుంది.

పైగా యూఏఈ, సౌదీల్లో ఆయన కంపెనీలకు మంచి గుర్తింపు లభిస్తోంది. ఇందుకు నిదర్శనంగా ట్రంప్‌ కంపెనీలతో వ్యాపార విస్తరణకు ఆసక్తిగా ఉన్నామని దుబాయ్‌ డీఏఎంఏసీ ప్రాజెక్టు చైర్మన్‌ హస్సన్‌ వ్యాఖ్యలను నిపుణులు గుర్తు చేస్తున్నారు. విదేశీ వాణిజ్య సంబంధాలు బలంగా ట్రంప్‌ కంపెనీలు కొనసాగిస్తే రుణాల నుంచి విముక్తి పొందే ఛాన్సులు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఎలాగైనా ట్రంప్‌ గడుసుపిండమని, అప్పుల్లోంచి ఈజీగా బయటపడడం గతంలో కూడా చేశాడని వ్యాఖ్యానిస్తున్నారు. 

మరిన్ని వార్తలు