ట్రంప్‌ నిర్ణయం వరమే!

10 Aug, 2020 19:39 IST|Sakshi

వలస నిపుణుల అంచనా

వాషింగ్టన్‌ : ఈ ఏడాది చివరి వరకూ గ్రీన్‌కార్డులు, శాశ్వత నివాస పర్మిట్లు నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం అగ్రరాజ్యంలో ఉద్యోగాలు చేపట్టే భారతీయులకు వరంగా మారిందని భావిస్తున్నారు. ఎన్నికల ఏడాది అమెరికన్లకు ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ట్రంప్‌ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్‌ ఉత్తర్వులు తిరిగి భారతీయులకు వెసులుబాటు కల్పించాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం  సెప్టెంబర్‌ చివరినాటికి ఉపయోగించని కుటుంబ ఆధారిత శాశ్వత నివాస కార్డులను అక్టోబర్‌ 1 నుంచి ప్రారంభమయ్యే తదుపరి ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగ ఆధారిత కోటాకు మళ్లిస్తారు. గ్రీన్ కార్డ్ నిషేధం కారణంగా యుఎస్ లో ఇటువంటి వలసదారులు ఈ ప్రక్రియ యొక్క చివరి దశలకు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించేలా ప్రాధాన్యత తేదీలను ముందుకు తీసుకువస్తారని అమెరికన్‌ న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రాధాన్యత తేదీల్లో ఇది భారతీయులకు ఉపకరిస్తుందని వారు చెబుతున్నారు. ఇక 1,10,000 గ్రీన్ కార్డులు ఉపాధి ఆధారిత కోటా కిందకు మళ్లించే అవకాశం ఉందని వలస నిపుణులు పేర్కొన్నారు.

ఉపాధి ప్రాధాన్య వలసదారులందరికీ కుటుంబ సభ్యులు సహా ఏటా కేవలం 1,40,000 గ్రీన్‌ కార్డులనే అమెరికా జారీ చేస్తోంది. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న పది లక్షల మంది వలసదారులు, వారి కుటుంబ సభ్యులు గ్రీన్‌కార్డుల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకుని బ్యాక్‌లాగ్‌లో ఉన్నారు. ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డు దరఖాస్తుదారుల్లో 3,00,000 దరఖాస్తులతో భారత్‌ నుంచే పెద్దసంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. భారత్‌కు చెందిన వీరంతా హెచ్‌1బీ వీసాపై అమెరికా వెళ్లి అక్కడ శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకున్నారు. బ్యాక్‌లాగ్‌లో భారతీయులే అత్యధికులుగా ఉన్నారు. నిబంధనల ప్రకారం భారతీయులకు 7 శాతం కోటా లభించనుండగా, ఇతర జాతీయులు వారి కోటా సంఖ్యను వాడుకోకుంటే వాటిని కూడా బ్యాక్‌లాగ్‌ను క్లియర్‌ చేసేందుకు కేటాయిస్తారు. బ్యాక్‌లాగ్‌ క్లియర్‌ చేస్తే భారతీయులే అధికంగా లబ్ధి పొందే వెసులుబాటు ఉందని వలస నిపుణులు పేర్కొంటున్నారు.

చదవండి : టిక్‌టాక్‌కు అమెరికా చెక్‌

మరిన్ని వార్తలు