కీవ్‌పై రష్యా భీకర దాడులు 

11 Oct, 2022 01:04 IST|Sakshi
కీవ్‌లో రష్యా వైమానిక దాడి నుంచి తృటిలో తప్పించుకున్న స్థానికుడు 

కీవ్‌: వ్యూహాత్మకంగా కీలకమైన క్రిమియా వంతెనపై జరిగిన బాంబు పేలుడును ఉగ్ర చర్యగా అభివర్ణించిన రష్యా.. ఉక్రెయిన్‌ వ్యాప్తంగా సోమవారం వరుసగా రెండో రోజు భీకర దాడులు కొనసాగించింది. కొద్ది నెలలుగా ప్రశాంతంగా ఉన్న రాజధాని కీవ్‌ సహా నగరాలు పేలుళ్లతో దద్దరిల్లాయి. దాడులపై ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉదయం ఏకధాటిగా నాలుగు గంటలపాటు సైరన్లు మోగాయి. దాడుల్లో కనీసం 10 మంది మృతి చెందగా 60 మంది వరకు గాయపడినట్లు సమాచారం.

కీలక ఇంధన, సైనిక వ్యవస్థలను టార్గెట్‌గా గగనతలం, సముద్రం, భూమిపై నుంచి తమ సైన్యం దాడులు సాగించినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించారు. ఉక్రెయిన్‌ ఉగ్రదాడులు కొనసాగిస్తే అందుకు తామిచ్చే జవాబు అత్యంత కఠినంగా ఉంటుందని హెచ్చరించారు. అంతకుముందు ఆయన సెక్యూరిటీ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొన్నారు. మరో పరిణామం..రష్యా, బెలారస్‌ ఉమ్మడి బలగాలను మోహరించనున్నట్లు బెలారస్‌ అధ్యక్షుడు లుకషెంకో ప్రకటించారు. బెలారస్‌పై దాడి చేసేందుకు ఉక్రెయిన్‌ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. అయితే, బలగాలను ఎక్కడ మోహరించేదీ లుకషెంకో వివరించలేదు. 

దేశంలోని మిగతా ప్రాంతాల్లో పోరాటం కొనసాగుతున్నా రాజధాని కీవ్‌లో జనజీవనం యథాప్రకారం కొనసాగుతోంది. కీవ్‌ ప్రజలు కొద్ది నెలలుగా ప్రశాంతతకు అలవాటుపడ్డారు. సోమవారం ఉదయం ఆ పరిస్థితి మారిపోయింది. ఒక్కసారిగా మొదలైన సైరన్ల మోతతో జనం ఉలిక్కిపడ్డారు. బాంబు షెల్టర్లలోకి పరుగులు తీశారు. అధికారులు రైలు సర్వీసులను రద్దు చేశారు. జనం రైల్వే స్టేషన్లనే షెల్టర్లుగా చేసుకున్నారు.

మరిన్ని వార్తలు