రోడ్డుపై పెద్ద సంఖ్యలో పడి ఉన్న కరెన్సీ నోట్లు..

21 Nov, 2021 04:38 IST|Sakshi
రహదారిపై పడిన కరెన్సీ నోట్లను తీసుకుంటున్న పౌరులు

Armored Truck Spills Cash On Highway: కాలిఫోర్నియా:  స్థలం: అమెరికాలో దక్షిణ కాలిఫోర్నియాలోని ఫ్రీవే రహదారి. సమయం: శుక్రవారం ఉదయం 9.15 గంటలు. దృశ్యం: రోడ్డుపై పెద్ద సంఖ్యలో పడి ఉన్న కరెన్సీ నోట్లు, ఒకరితో ఒకరు పోటీ పడుతూ వాటిని జేబుల్లో నింపుకుంటున్న జనం. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. శాన్‌డిగో నుంచి కాలిఫోర్నియాలోని ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ కార్యాలయానికి డబ్బు సంచులతో బయలుదేరిన వాహనం తలుపు మార్గమధ్యంలో అకస్మాత్తుగా తెరుచుకుంది. కొన్ని సంచులు కిందపడి పోయాయి. వాటిలోని డబ్బులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.

చాలావరకు ఒక డాలర్, 20 డాలర్ల నోట్లే ఉన్నాయి. గమనించిన వాహనదారులు వాటిని జేబుల్లో వేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇరువైపులా రోడ్డును దిగ్బంధించారు. వాహనదారులను అడ్డుకున్నారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆదేశించడంతో కొందరు ఇచ్చేశారు. చాలామంది అక్కడి నుంచి జారుకున్నారు. డెమీ బాగ్బీ అనే బాడీ బిల్డర్‌ ఈ దృశ్యాలన్నీ ఫోన్‌లో చిత్రీకరించి, ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేశాడు. ఎన్ని డబ్బులు పోయాయన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తీసుకున్నవారు తిరిగి ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
 

మరిన్ని వార్తలు