మాస్కోపై డ్రోన్‌ దాడులు 

31 May, 2023 03:16 IST|Sakshi

మాస్కో: రష్యా రాజధాని మాస్కోపై మంగళవారం ఉదయం డ్రోన్‌ల దాడి జరిగింది. ఈ దాడిలో ప్రాణహాని జరగలేదని, భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. మాస్కోపైకి దూసుకొచ్చిన ఎనిమిది డ్రోన్లను రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని చెప్పారు. డ్రోన్‌ల దాడిపై అధ్యక్షుడు పుతిన్‌ స్పందించారు. ఇది ఉక్రెయిన్‌ ప్రభుత్వం చేసిన ఉగ్రవాద దాడి అంటూ ఆరోపించారు.  

మాస్కోలో డ్రోన్లను కూల్చి వేసిన ప్రాంతంలో కొన్ని భవనాలకు స్వల్ప నష్టం వాటిల్లిందని నగర మేయర్‌ సెర్గీ సొబియానిన్‌ చెప్పారు. ఇద్దరు పౌరులకు స్వల్పంగా గాయాలయ్యాయి, దెబ్బతిన్న రెండు బహుళ అంతస్తుల భవనాల్లోని వారిని ఖాళీ చేయించామని తెలిపారు. అయిదు డ్రోన్లను మాస్కోలో కూల్చివేయగా, మూడింటిని జామ్‌ చేసి దారి మళ్లించి పేల్చివేసినట్లు రక్షణ శాఖ తెలిపింది.

యుద్ధం మొదలైన దాదాపు ఏడాదిన్నర కాలంలో డ్రోన్లతో ఏకంగా సుదూర ప్రాంతంలోని రష్యా రాజధానిపై డ్రోన్‌ దాడి జరగడం ఇది రెండోసారి. ఈ నెలారంభంలో అధ్యక్షుడు పుతిన్‌ లక్ష్యంగా రెండు డ్రోన్‌లు క్రెమ్లిన్‌పైకి వచ్చాయని రష్యా ఆరోపించింది. రష్యా గత 24 గంటల్లో మూడో విడత ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై వేకువజామున బాంబులతో విరుచుకుపడింది.

కీవ్‌ వాసులు భయంతో షెల్టర్లలోకి పరుగులు తీశారు. దాడులతో ఒకరు చనిపోయారు. పేలుడు పదార్థాలతో వచి్చన 20 షహీద్‌ డ్రోన్లను కూల్చి వేసినట్లు కీవ్‌ అధికారులు తెలిపారు. మొత్తమ్మీద 24 గంటల్లో 31 వరకు డ్రోన్లను కూల్చి వేసినట్లు ఉక్రెయిన్‌ తెలిపింది.  

మరిన్ని వార్తలు