తెలివైన జింకలు.. రౌండప్‌ చేశాయంటే కష్టమే!

7 Apr, 2021 10:29 IST|Sakshi

సాక్షి సెంట్రల్‌ డెస్క్: ఒకటీ రెండు కాదు.. పదో, వందో కాదు.. వేల కొద్దీ జింకలు తుఫాను గాలిలా గుండ్రంగా తిరుగుతున్నాయి. అదీ మెల్లమెల్లగా ఏమీ కాదు.. ఉరుకులు పరుగులతో రౌండ్స్‌ వేస్తున్నాయి. మరి ఇవి ఎందుకిలా తిరుగుతున్నాయనే డౌట్‌ వస్తోంది కదా.. ఇదంతా భద్రత కోసమే. తమపై దాడి చేయడానికి వచ్చిన జంతువులను కన్ఫ్యూజ్‌ చేసి, బెదరగొట్టేందుకు ఉత్తర ప్రాంత దేశాల్లోని రెయిన్‌డీర్‌ జింకలు ఇలా చేస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఏదైనా ఆపద ముంచుకొచ్చిందని అనుమానం రాగానే.. జింకలన్నీ గుండ్రంగా తిరగడం మొదలుపెడ్తాయని, పిల్లలను మధ్యలో ఉంచి రక్షణ కలిపిస్తాయని అంటున్నారు.


 
మామూలుగా వేటకుక్కలు, తోడేళ్లు, పులుల వంటి క్రూర జంతువులు.. మందలుగా ఉన్న జింకలు, లేళ్లు, అడవి గేదెల నుంచి ఒక్కొదానికి వేరుచేయడానికి ప్రయత్నిస్తాయి. మంద నుంచి విడిపోయిన దానిని చుట్టుముట్టి చంపి తింటాయి. ఇలాంటి పరిస్థితి రాకుండా, మందలో ఏదో ఒక్క జింకను టార్గెట్‌ చేయలేకుండా కన్ఫ్యూజ్‌ చేసేందుకు రెయిన్‌ డీర్‌లు గుండ్రంగా తిరుగుతాయి. ఇందులోనూ బలంగా, పెద్దగా ఉన్న జింకలు అంచుల్లో తిరుగుతూ.. పిల్లలు, చిన్నవి మధ్యలో ఉంటాయి. ఉత్తర రష్యాలోని ముర్మాన్సక్‌ ప్రాంతంలో ఫెడొసెయెవ్‌ అనే ఫొటోగ్రాఫర్‌ డ్రోన్‌తో ఈ ఫొటోలు తీశారు. ఇంతకీ ఈసారి ఈ జింకలు ఎవరికి భయపడ్డాయో తెలుసా? వాటికి వ్యాక్సిన్‌ వేయడానికి వచ్చిన ఓ వెటర్నరీ డాక్టర్‌ను చూసి జడుసుకున్నాయట.


 

మరిన్ని వార్తలు