-

ఇది విల్లా కాదు.. జైలు.. ఇక్కడ బతకలేను: యువరాణి

17 Feb, 2021 12:00 IST|Sakshi
లతీఫాతో మేరీ రాబిన్‌సన్‌(ఫైల్‌ ఫొటో)

దుబాయ్‌: ‘‘ఈ విల్లా ఓ జైలులా మారిపోయింది. నేను బందీగా పడి ఉన్నాను’’ అన్న దుబాయ్‌ యువరాణి షికా లతీఫా మాటలు మరోసారి సంచలనం రేపుతున్నాయి. బాతూరూంలో ఓ మూలన నక్కి ఆమె రోదిస్తున్న తీరు ఎడారి దేశంలో మహిళలకు ఉన్న కట్టుబాట్ల గురించి మరోసారి చర్చకు దారి తీసింది. యువరాణిగా పుట్టినందుకు తనకు స్వేచ్ఛ లేదని, రాచకుటుంబ ఆంక్షల చట్రం నుంచి బయటపడేందుకు రెండేళ్ల క్రితం లతీఫా చేసిన ప్రయత్నం బెడిసి కొట్టిన విషయం తెలిసిందే. దుబాయ్ ప్రధాని,‌ రాజు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మకతూమ్ కుమార్తె అయిన ఆమె... అమెరికాలో ఆశ్రయం పొందాలనే యోచనతో అధికారుల కళ్లు గప్పి పడవలో పారిపోయేందుకు ప్రయత్నించారు. 

ఇందులో భాగంగా ఫిన్‌ల్యాండ్‌కు చెందిన తన స్నేహితురాలు తినా జౌహానియన్, ఫ్రాన్స్‌కు చెందిన కెప్టెన్‌ హెర్వ్‌ జాబెర్ట్‌ , మరో ముగ్గురు సిబ్బందితో కలిసి మరపడవలో బయల్దేరారు. ఈ క్రమంలో ఆమెను భారత్‌లోని గోవా తీర ప్రాంతానికి చేరుకున్న యూఏఈ అధికారులు అక్కడి నుంచి తిరిగి దుబాయ్‌ తీసుకువెళ్లారు. ఈ క్రమంలో తన తండ్రి వేధింపులు భరించలేక పారిపోతున్నానని లతీఫా గతంలో రికార్డు చేసిన వీడియోను బ్రిటన్‌కు చెందిన మీడియా సంస్థ వెలుగులోకి తెచ్చింది. 

ఈ నేపథ్యంలో ఇన్వెస్టిగేటివ్‌ న్యూస్‌ ప్రోగ్రాం పనోరమలో భాగంగా బీబీసీ మంగళవారం మరో క్లిప్‌ను మంగళవారం విడుదల చేసింది. ‘‘ఇక్కడ నేనొక ఖైదీని. జైలులాంటి విల్లాలో నేను ఉండలేను. ఇంటి ముందు ఓ ఐదుగురు పోలీసులు, ఇంట్లో ఇద్దరు పోలీసు అధికారులు ఉన్నారు. నా భద్రత, నా జీవితం గురించి ప్రతిరోజూ ఆందోళన చెందుతూనే ఉన్నాను. రోజురోజుకీ నా పరిస్థితి దిగజారిపోతోంది. ఈ జైలులో బతకలేను. నాకు స్వేచ్ఛ కావాలి’’ అని లతీఫా బాధతో అంటున్న మాటలు ఈ క్లిప్‌లో వినిపించాయి. అయితే దీనిని ఎప్పుడు రికార్డు చేశారన్న విషయంపై మాత్రం స్పష్టత లేదు. 

కాగా గోవా తీరం నుంచి లతీఫాను వెనక్కి తీసుకువచ్చిన తర్వాత, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మాజీ హైకమిషనర్‌, ఐర్లాండ్‌ మాజీ అధ్యక్షురాలు మేరీ రాబిన్‌సన్‌ దుబాయ్‌ రాజు ఇంట్లో ఆమెను కలిశారు. వీరిద్దరు కలిసి భోజనం చేస్తున్న ఫొటోలను యూఏఈ అధికారులు విడుదల చేయడం ద్వారా లతీఫా క్షేమంగానే ఉన్నారనే సంకేతాలు ఇచ్చారు. అయితే ఇప్పటికీ తనను బందీగానే ఉంచారంటూ లతీఫా ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.

చదవండిబాడీగార్డ్‌తో సంబంధం.. రూ. 9 కోట్లు చెల్లించిన ప్రిన్సెస్

మరిన్ని వార్తలు