Dubai Expo: ఒకప్పుడు ఇసుకతో ఎడారిగా.. ఇప్పుడు ప్రపంచంలోని అద్భుతాలకు..

2 Oct, 2021 08:23 IST|Sakshi
ఎగ్జిబిషన్‌ వద్ద తిరుగాడుతున్న ఓ రోబోతో సెల్ఫీ తీసుకుంటున్న యువతి

దుబాయ్‌: ఎనిమిదేళ్ల పాటు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన దుబాయ్‌లోని వరల్డ్‌ ఫెయిర్‌ (అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌) ఎట్టకేలకు పూర్తయింది. ఒకప్పుడు ఇసుకతో ఎడారిగా కనిపించిన ప్రదేశం ఇప్పుడు ప్రపంచంలోని నలుమూలల ఉన్న అద్భుతాలకు నమూనాలను రూపొందించి కన్నుల విందుగా మారింది. మొత్తం 190 దేశాలకు సంబంధించిన పెవిలియన్స్‌ (విభాగాలు) ఇందులో ఉన్నాయి. మధ్యప్రాచ్యంలో ఏర్పాటైన తొలి అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌గా ఇది రికార్డులకెక్కింది.

మొత్తం 1080 ఎకరాల్లో నిర్మించిన ఈ ఎగ్జిబిషన్‌ దాదాపు ఆర్నెళ్ల పాటు దేశవిదేశాలకు చెందిన పర్యాటకులను ఆకర్షించనుంది. స్పేస్‌ ఎక్స్‌ ఫాల్కన్‌ 9 రెప్లికా, అమెరికా మూడో అధ్యక్షుడు వాడిన ఖురాన్, ట్రాన్స్‌ఫార్మర్‌లా మారే చైనా కారు, 20 లక్షల ప్లాస్టిక్‌ బాటిళ్లతో తయారైన 70 కిలోమీటర్ల ఇటలీ తాడు, మైఖెలాంజెలో చెక్కిన బైబిల్‌ హీరో డేవిడ్‌ త్రీడీ బొమ్మ వంటివి ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. భవిష్యత్తులో చూడబోయే టెక్నాలజీల ప్రొటోటైప్‌లు కూడా ఇందులో ఉండనున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటి వరకూ అమెరికా, యూరోప్‌ తప్ప మధ్యప్రాచ్యంలో ఎప్పుడూ ఈ ఎగ్జిబిషన్‌ నిర్వహించలేదు.  

చదవండి: (హవానా... అంతా భ్రమేనా?!) 

మరిన్ని వార్తలు