నీటి కాసులను గుర్తిస్తుంది... కత్తిపోటుకు కట్టు వేస్తుంది!

21 Nov, 2021 03:45 IST|Sakshi

వినూత్నమైన హోప్స్, రియాక్ట్, ప్లాస్టిక్‌ స్కానర్‌ పరికరాలకు డైసన్‌ అవార్డులు

James Dyson Award 2021: Plastic Scanner Device Won Dyson Award: యువత తన మస్తిష్కానికి పదును పెడితే ఎన్నో ఆలోచనలు వస్తాయి. అతి క్లిష్టమైన సమస్యల నుంచి చిన్న చిన్న ఇబ్బందులకు కూడా సమాధానం చెప్పే ఆవిష్కరణలు పుడతాయి. నిత్య జీవనంలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రూపొందించిన సృజనాత్మక ఆవిష్కరణలను అంతర్జాతీయంగా గుర్తింపునిచ్చి ప్రోత్సహిస్తున్నారు జేమ్స్‌ డైసన్‌. వివిధ దేశాలకు చెందిన యువత రూపొందించిన ఆవిష్కరణలకు ఏటా డైసన్‌ అవార్డులు అందజేస్తున్నారు. ఈ ఏడాది 28 దేశాల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వివిధ విభాగాల్లో తొలిస్థానంలో నిలిచిన ఆవిష్కరణలను ఇటీవలే ప్రకటించారు. ఇవీ ఈ ఏడాది డైసన్‌ అవార్డు సాధించిన ఆవిష్కరణలు.. 

ఇంట్లోనే కంటి పరీక్ష 
వృద్ధుల్లో కంటిచూపు మందగించి పోయేలా చేసే నీటి కాసులను ఇంట్లోనే గుర్తించేందుకు నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌ శాస్త్రవేత్తలు హోప్స్‌ (హోమ్‌ ఐ ప్రెషర్‌ ఈ–స్కిన్‌ సెన్సర్‌) పేరుతో వినూత్న పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఫొటోలో చూపిన నల్లటి చేతి తొడుగును కంటి వద్ద ఉంచుకోవడం ద్వారా కంటి లోపలి భాగాలపై పడుతున్న ఒత్తిడిని గుర్తించొచ్చు.

ఇందుకోసం పరికరంలో సెన్సర్‌ను అమర్చారు. ఇది కంటిపై పడే ఒత్తిడిని బాగా గుర్తించగలదు. పరికరాన్ని కనురెప్ప మధ్యభాగంలో ఉంచితే ఒత్తిడి సమాచారాన్ని మెషీన్‌ లెర్నింగ్‌ సాయంతో విశ్లేషించి ఫలితాలు స్మార్ట్‌వాచ్‌లో ప్రదర్శితమవుతాయి. ఈ పరికరం డైసన్‌ అవార్డుల్లో అంతర్జాతీయ విభాగంలో విన్నర్‌గా నిలిచింది. 

ప్లాస్టిక్‌ రకాలను పట్టేస్తుంది 
ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని వదిలించుకోవాలంటే.. వ్యర్థాల్లో ఏది ఏ రకమైందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పటివరకు ఇలా వేర్వేరు రకాల ప్లాస్టిక్‌ను గుర్తించడం కొంత శ్రమతో కూడుకున్న పని. నెదర్లాండ్స్‌కు చెందిన డెఫ్ట్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ సమస్యను పరిష్కరించేందుకు ఈ వినూత్నమైన ప్లాస్టిక్‌ సెన్సర్‌ను అభివృద్ధి చేశారు. పరారుణ కాంతి స్పెక్ట్రోస్కోపీ సాయంతో పనిచేస్తుంది. చిత్రంలో చూపినట్లు చేత్తో పట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు.

ఈ స్కానర్‌ సాయంతో ఏ రకమైన ప్లాస్టిక్‌ను రీసైకిల్‌ చేసే అవకాశం ఉందో స్పష్టంగా గుర్తించవచ్చు. ఎక్కడికక్కడ ప్లాస్టిక్‌ రీసైకిల్‌ చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. అదే సమయంలో భారీ రీసైక్లింగ్‌ కేంద్రాల్లో ప్లాస్టిక్‌ను వేరు చేసేందుకు పెడుతున్న ఖర్చును కూడా తగ్గిస్తుంది. ఈ పరికరం డైసన్‌ అవార్డుల్లో సస్టెయినబిలిటీ విభాగంలో తొలిస్థానంలో నిలిచింది. 

కత్తిపోట్ల చికిత్సకు కొత్త పరికరం 
కత్తిపోట్లు లేదా శరీరంలోకి పదునైన వస్తువులు చొచ్చుకుపోయినప్పుడు అయ్యే గాయాలకు మెరుగైన చికిత్స కల్పించేందుకు యూకేకు చెందిన లౌబరో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ వినూత్న పరికరాన్ని తయారు చేశారు. కత్తిపోట్ల గాయల ద్వారా అయ్యే రక్తస్రావాన్ని వేగంగా నిరోధించేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుంది. ఇలాంటి గాయాలైనప్పుడు చాలామంది అందుకు కారణమైన కత్తి, ఇతర వస్తువులను శరీరం నుంచి తీసేస్తుంటారని, దీనివల్ల రక్తస్రావం ఎక్కువవుతుంది.

రియాక్ట్‌ అని పిలుస్తున్న ఈ కొత్త పరికరంలో సిలికాన్‌తో తయారైన గాలిబుడగ ఉంటుంది. గాయంలోకి ఈ గాలిబుడగను చొప్పించి ఉబ్బిపోయేలా చేస్తారు. అదే సమయంలో గాయం లోపలి భాగాలపై ఒత్తిడి పెరిగి రక్తస్రావం అదుపులోకి వస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారు. కొత్తగా ప్రవేశపెట్టిన మెడికల్‌ విభాగంలో ఈ పరికరం ఫస్ట్‌ ప్రైజ్‌ కొట్టేసింది. 
– సాక్షి, హైదరాబాద్‌  

మరిన్ని వార్తలు