ట్రంప్‌ వ్యాఖ్యలతో విభేదిస్తున్న నిపుణులు

27 Aug, 2020 20:50 IST|Sakshi

5.1 కోట్ల కొలువులు కాపాడలేదు

వాషింగ్టన్‌ : కోవిడ్‌-19 మహమ్మారి సవాల్‌ విసిరినా తాము 5.1 కోట్ల ఉద్యోగాలను కాపాడామని, అధ్యక్ష ఎన్నికల్లో ఇదే తమ ప్రచార నినాదమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదేపదే చెబుతున్నారు. కరోనా వైరస్‌ వెంటాడినా ఆర్థిక వ్యవస్థను సమర్ధంగా నిర్వహించామని ఆయన పలు ప్రచార కార్యక్రమాల్లోనూ హోరెత్తిస్తున్నారు. చారిత్రక ఉద్దీపన ప్యాకేజ్‌తో తాము 5 కోట్లకు పైగా అమెరికన్ల ఉద్యోగాలను కాపాడామని ట్రంప్‌ చెబుతూ తమ డెమొక్రటిక్‌ ప్రత్యర్ధులు వీటిని గుర్తించరని దుయ్యబట్టారు. ఈ గణాంకాలను వారు ఇష్టపడరని, ఎందుకంటే ఎన్నికల్లో అవి తమను దెబ్బతీస్తాయని వారి భయమని ట్రంప్‌ ఇటీవల చెప్పుకొచ్చారు. 660 బిలియన్‌ డాలర్లతో కూడిన పేచెక్‌ ప్రొటెక్షన్‌ ప్రోగ్రాం (పీపీపీ) ద్వారా 5.1 కోట్ల అమెరికన్‌ ఉద్యోగాలను ఆదుకున్నామని ట్రంప్‌ సహా రిపబ్లికన్‌ పార్టీ తమ ప్రచార కార్యక్రమాల్లో ఊదరగొడుతోంది. నార్త్‌ కరోలినాలో ఇటీవల జరిగిన ర్యాలీలోనూ ట్రంప్‌ ఇదే విషయం ప్రస్తావించారు. చదవండి : ట్రంప్‌ను పొగడుదామ‌ని త‌ప్పులో కాలేసింది

అయితే పీపీపీతో 5.1 కోట్ల ఉద్యోగాలు కాదుకదా కనీసం ఆస్ధాయికి చేరువలో కూడా ఉద్యోగాలను ఆ ప్యాకేజ్‌ రక్షించలేదని రాయటర్స్‌ ఇంటర్వ్యూల్లో పలువురు ఆర్థికవేత్తలు, విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ ప్యాకేజ్‌ ద్వారా కేవలం పది లక్షల నుంచి 1.4 కోట్ల లోపు ఉద్యోగాలు మాత్రమే కాపాడగలిగారని ఈ సందర్భంగా ఆర్థిక వేత్తలు స్పష్టం చేశారు. పీపీపీ ద్వారా 5.1 కోట్ల ఉద్యోగాలను కాపాడినట్టు ఏ ఆర్థికవేత్త చెబుతారని తాననుకోనని యూఎస్‌ ట్రెజరీ విభాగం ఫైనాన్షియల్‌ ఎకనమిస్ట్‌ రిచర్డ్‌ ప్రిసిన్‌జనో పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 50 నుంచి 70 లక్షల ఉద్యోగాలు సురక్షితంగా ఉండవచ్చని ఆయన అంచనా వేశారు. రుణాల కోసం వాణిజ్య సంస్ధలు ప్రతిపాదించిన మొత్తం ఉద్యోగుల సంఖ్య 5.1 కోట్లని ఇది వారు కాపాడిన ఉద్యోగాల సంఖ్య కాదని పీపీపీ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన ట్రెజరీ విభాగం, చిన్న వ్యాపారాల యంత్రాంగం (ఎస్‌బీఏ) అధికారులు తెలిపారు. అయితే తాము పెద్దసంఖ్యలో ఉద్యోగాలను కాపాడామని, అది తిరుగులేని వాస్తవమని వైట్‌ హైస్‌ ప్రధాన ఆర్థిక సలహాదారు లారీ కుడ్లో చెప్పుకొచ్చారు.

>
మరిన్ని వార్తలు