వెనక్కి తగ్గని ఇజ్రాయెల్, హమాస్‌

14 May, 2021 05:20 IST|Sakshi
గాజా స్ట్రిప్‌ వైపు ఫిరంగులను ప్రయోగిస్తున్న ఇజ్రాయెల్‌ సైన్యం

మళ్లీ పరస్పరం రాకెట్‌ దాడులు

చర్చల కోసం రంగంలోకి ఈజిప్టు 

ఇజ్రాయెల్, హమాస్‌ ప్రతినిధులతో సంప్రదింపులు ప్రారంభం

గాజా సిటీ: ఇజ్రాయెల్, పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్‌ మధ్య ఉద్రిక్తతలు యథాతథంగా కొనసాగుతున్నాయి. గురువారం ఇరు వర్గాలు భీకరస్థాయిలో ఘర్షణకు దిగాయి. రాకెట్లతో నిప్పుల వర్షం కురిపించుకున్నాయి. మరోవైపు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఈజిప్టు రంగంలోకి దిగింది. ఉద్రిక్తతలను చల్లార్చి, సాధారణ స్థితిని నెలకొల్పడమే లక్ష్యంగా ఈజిప్టు మధ్యవర్తులు ఇజ్రాయెల్, హమాస్‌ ప్రతినిధులతో సంప్రదింపులు ప్రారంభించారు.

ఒకవైపు చర్చలు సాగుతుండడగానే రాకెట్లతో దాడులు కొనసాగడం గమనార్హం. హమాస్‌ భారీ స్థాయిలో రాకెట్లతో ఇజ్రాయెల్‌ భూభాగంపై విరుచుకుపడింది. కొన్ని రాకెట్లు ముఖ్యనగరం టెల్‌ అవీవ్‌ దాకా దూసుకురావడం గమనార్హం. ఇజ్రాయెల్‌ సైన్యం సైతం ధీటుగా బదులిచ్చింది. గాజాపై తన అస్త్రాలను ఎక్కుపెట్టింది. ఇంకోవైపు గాజాలో అరబ్, యూదు ప్రజలు వీధుల్లో బాహాబాహీకి దిగారు.

13 మంది హమాస్‌ తీవ్రవాదులు హతం!
గాజాలో హమాస్‌ తీవ్రవాదులు తలదాచుకుంటున్నట్లు భావిస్తున్న మూడు బహుళ అంతస్తుల భవనాలను ఇజ్రాయెల్‌ దళాలు ధ్వంసం చేశాయి. ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇప్పటివరకు 83 మంది పాలస్తీనా పౌరులు మరణించారని, వీరిలో 17 మంది చిన్నారులు ఉన్నారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. తమ సభ్యులు 13 మంది అమరులైనట్లు హమాస్‌ తెలిపింది. హమాస్‌ దాడుల్లో ఏడుగురు ఇజ్రాయెల్‌ వాసులు ప్రాణాలు కోల్పోయారు.

‘ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్, దిమోనా, జెరూసలేం నగరాలపై బాంబులు వేయడం మాకు మంచి నీళ్లు తాగడం కంటే సులభం’ అని హమాస్‌ మిలటరీ విభాగం ప్రతినిధి ఒకరు ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ అణు రియాక్టర్‌ దిమోనా సిటీలో ఉంది. హమాస్‌ తమ దేశంపై 1,200 రాకెట్లు ప్రయోగించగా, ఐరన్‌ డోమ్‌ మిస్సైల్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌తో 90 శాతం రాకెట్లను నిర్వీర్యం చేశామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది.  

మరిన్ని వార్తలు