ప్రియురాలి ముద్దే.. పోలీసులకు పట్టించింది, గురువును మించిన శిష్యుడు చిక్కాడు!

18 Apr, 2022 20:28 IST|Sakshi
ఎల్ పిట్‌ను పట్టించిన ఫొటో ఇదే

అతనొక భయంకరమైన నేరస్తుడు. సుమారు 200 దేశాల మోస్ట్‌ వాంటెడ్‌ లిస్ట్‌లో ఉన్నాడు. 196 దేశాల్లో ఇంటర్‌పోల్‌ అతని అరెస్ట్‌ కోసం రెడ్‌ వారెంట్‌ జారీ చేసింది. ఏళ్ల తరబడి తప్పించుకుని తిరుగుతున్నాడు. అయితే ప్రియురాలి అత్యుత్సాహంతో ఎట్టకేలకు బుక్కైపోయాడు. ఆమెకు ముద్దు పెట్టి పోలీసులకు దొరికిపోయాడు. అదెలాగంటే.. 

మెక్సికన్‌ డ్రగ్‌ లార్డ్‌, సినాలోవా కార్టెల్‌ మాఫియా ముఖ్యనేత జోవాక్విన్‌ గుజ్‌మన్‌ అలియాస్‌ ఎల్ చాపో గుర్తున్నాడా? ప్రస్తుతం అతను జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.  అతని ముఖ్య అనుచరుడు, ఎల్ పిట్ గా పేరొందిన ‘బ్రియాన్ డొనాసియానో ఒలుగ్విన్ వెర్డుగో’ మాత్రం పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. అంతేకాదు ఇప్పటికీ డ్రగ్స్‌లావాదేవీలు, అక్రమ రవాణా కొనసాగిస్తూ.. ఎల్‌ చాపోనే మించిపోయాడు. అలా 39 ఏళ్ల ఎల్ పిట్‌పై.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్ పోల్ వారెంట్లు జారీ అయ్యాయి. 

చివరికి.. అతగాడి గాళ్ ఫ్రెండ్ అత్యుత్సాహమే అతన్ని పట్టించింది. కొన్నిరోజుల కిందట ఫేస్ బుక్ లో అమెరికా డ్రగ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీ అధికారులకు ఓ ఫొటో కంటబడింది. ఓ పర్యాటక ప్రాంతంలో ఓ జంట ముద్దు పెట్టుకుంటున్న ఫొటో అది. ఆ ఫొటోలో ఉన్నది ఎల్ పిట్ అని గుర్తించిన అమెరికా డ్రగ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అతడు కొలంబియాలో ఉన్నట్టు కనిపెట్టారు.

పక్కా స్కెచ్‌తో.. 
వెంటనే కొలంబియా అధికారులకు సమాచారం అందించారు. దాంతో పక్కా ప్లాన్ వేసిన కొలంబియా పోలీసులు క్యాలీ నగరంలోని ఓ విలాసవంతమైన అపార్ట్ మెంట్ లో ఎల్ పిట్ ను అదుపులోకి తీసుకున్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి అతడు కొలంబియాలోనే ఉంటున్నాడట. మెక్సికో, అమెరికా దేశాలకు వేల కోట్ల విలువైన కొకైన్ ను తరలించేందుకు కొలంబియాలోని (రివల్యూషనరీ ఆర్మ్ డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా) 'ఫార్క్' గెరిల్లా దళాల సాయం కోరేందుకు అతడు కొలంబియాలో మకాం వేసినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. 

ఈ క్రమంలో.. మెక్సికోలో మోడల్‌ అయిన తన గర్ల్‌ఫ్రెండ్‌తో క్యాలీలో ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో దిగినట్లు తెలిసింది. ఆపై ఆమె ప్రఖ్యాత టూరిస్టు కేంద్రం లాస్ క్రిస్టాలెస్ కు తీసుకువచ్చింది. అక్కడ పర్వతంపై ముద్దు పెట్టుకుంటూ ఇద్దరూ సెల్ఫీ దిగారు. ఆ ఫొటోను ఆమె సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయగా.. దొరికిపోయాడు. 

ఇదే మెక్సికోలో అయి ఉంటేనా?
అయితే దాడుల సమయంలో తనను అరెస్ట్ చేయవద్దంటూ ఎల్ పిట్ కొలంబియా పోలీసులకు 2,65,000 డాలర్ల  లంచం ఇచ్చే ప్రయత్నం చేశాడట. అంతేకాదు, ఇదే ఘటన మెక్సికోలో జరిగుంటే తన సాయుధ దళాలు కొద్దిసేపట్లోనే తనను విడిపించి ఉండేవని పోలీసులతో చెప్పాడట. గట్టి భద్రత మధ్య అతడిని పలు కేసుల విచారణ నిమిత్తం అమెరికాలోని కాలిఫోర్నియాకు తరలించనున్నారు.

మరిన్ని వార్తలు