చనిపోయే ముందు వాళ్లకు స్పెషల్ గ్రీటింగ్స్ పంపిన బ్రిటన్ రాణి

12 Sep, 2022 16:40 IST|Sakshi

లండన్‌: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్ 2 గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆమె చనిపోవడానికి ముందు వివాహబంధంలో 60 ఏళ్ల పూర్తి చేసుకున్న కొన్ని జంటలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక గ్రీటింగ్స్ పంపారు. వీటిపై ఆమె స్వయంగా సంతకం చేశారు. ఈ అరుదైన కార్డు తమకు కూడా అందిందని ఓ వృద్ధ జంట వెల్లడించింది. రాణి సంతకం చేసిన గ్రీటింగ్ కార్డు అందుకున్న అతికొద్ది మందిలో తామూ ఉండటంపై ఆనందం వ్యక్తం చేసింది. 

ఈ భార్యాభర్తల పేర్లు ట్రికియా పోంట్, రాయ్. సెప్టెంబర్‌ 8న వీరి 60వ వివాహ వార్షికోత్సవం. రాణి ఎలిజబెత్‌ 2 కూడా అదే రోజు మరణించారు. అయితే అంతకుముందే ఆమె ఈ ఏడాది డైమండ్ వెడ్డింగ్ యానివర్సరీ(60వ పెళ్లిరోజు) జరుపుకుంటున్న కొన్ని జంటలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖలు పంపారు. ప్రస్తుత రాజు కింగ్ చార్లెస్ 3 నుంచి కూడా వీరికి లేఖలు అందే అవకాశం ఉంది.

సుర్రేకు చెందిన ఈ వృద్ధ దంపతులు రాణి నుంచి అందిన గ్రీటింగ్ కార్డు చూసి మురిసిపోయారు. ఇది తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామన్నారు. ఈ లెటర్ ఓపెన్ చేసిన అనంతరం వేడుక చేసుకునేందుకు సెప్టెంబర్ 8న మధ్యాహ్నం బయటకు లంచ్‌కు వెళ్లారు. అయితే ఇంటికి తిరిగివచ్చేసరికి రాణి మరణవార్త తెలిసి షాక్‌కు గురయ్యారు.

80ఏళ్లు పైబడిన ఈ వృద్ధ జంట.. రాణి తమకు పంపిన లేఖను నిధిలా దాచుకుంటామన్నారు. ప్రపంచంలోని అతికొద్ది మందికి మాత్రమే రాణి సంతకం చేసిన లేఖలు అందాయని, అందుకే ఇది తమకు ఎంతో విలువైనదని చెప్పారు. రాణికి తాము పెద్ద అభిమానులమని, దేశానికే ఆమె స్పూర్తిదాయకం అని కొనియాడారు.
చదవండి: బ్రిటన్ రాజకుటుంబం ఆస్తుల విలువ తెలుసా?

మరిన్ని వార్తలు