ప్రపంచంలోనే మొట్టమొదటిది.. ‘రేస్‌ బర్డ్‌’కు ఎన్నెన్నో విశేషాలు

18 Apr, 2022 11:38 IST|Sakshi

ఇప్పుడు అన్ని వాహనాలు ఎలక్ట్రిక్‌మయం అయిపోతున్నాయ్‌. బైక్‌లు, కార్లు మొదలుకొని బస్సుల దాకా అన్ని వాహనాలు కరెంటుతో నడుస్తున్నాయ్‌. ఇదే కోవలో ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్‌ రేసింగ్‌బోట్‌ సిద్ధం కాబోతోంది. దాని విశేషాలేంటో చూద్దాం...    
–సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌ 

ఎలక్రిక్‌ రేసింగ్‌ బోట్‌ ‘రేస్‌బర్డ్‌’ ప్రొటోటైప్‌ మొదటి టెస్ట్‌రన్‌ విజయవంతంగా పూర్తిచేసుకుంది. ఇది ఇటీవల ఉత్తర ఇటలీలోని సాన్‌ నజారో సమీపంలోని ‘పో’ అనే నదిపై దూసుకుపోయింది. మాజీ పవర్‌బోట్‌ చాంపియన్‌ లూకా ఫెరారీ ఈ బోట్‌ను నడిపారు. వచ్చే ఏడాది మొదటిసారి జరగనున్న ఎలక్ట్రిక్‌ రేస్‌బోట్‌ చాంపియన్‌షిప్‌లో ‘ఈ1’ అనే ఈ రేస్‌బర్డ్‌ పాల్గొననుంది.  

జలాలపై విద్యుత్‌ విప్లవం 
‘రేస్‌బర్డ్‌ ఎగిరింది. మాకు చాలా సంతోషంగా ఉంది’ అని టెస్ట్‌రన్‌ తర్వాత ఈ1 సిరీస్‌ ట్విట్టర్‌లో ప్రకటించింది. విద్యుత్‌ విప్లవం అధికారికంగా జలాలను తాకిందని గర్వంగా తెలిపింది. పో నదిపై టెస్ట్‌రన్‌ నిర్వహించినప్పుడు ఇంజనీర్లు పలు సాంకేతిక పరీక్షలు చేసి రేస్‌బర్డ్‌ సామర్థ్యాన్ని పరీక్షించారు. త్వరలో వేర్వేరు వాతావరణ పరిస్థితుల్లో ఇది ఎలా పనిచేస్తుందో పరీక్షిస్తామని కంపెనీ బృందం తెలిపింది. మరికొన్ని వారాలపాటు దీన్ని అన్నిరకాలుగా పరీక్షించనున్నట్లు పేర్కొంది.  

అలల నుంచి 16 అంగుళాలు పైకి... 
ఈ రేస్‌బర్డ్‌ ఆలోచన నార్వేకు చెందిన సోఫి హోర్న్‌ అనే డిజైనర్‌ మది నుంచి పుట్టింది. హైడ్రోఫాయిల్‌ సాంకేతికతో రూపొందించిన ఈ పడవ నీటి అలల నుంచి 16 అంగుళాల ఎత్తువరకు ఎగరగలదు. ఆ సమయంలో నీటిపై కంటే కూడా ఎక్కువ వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం కలిగిఉంటుంది. రేస్‌బర్డ్‌ కోసం అభిమానులు ఇక ఎంతో కాలం వేచిచూడాల్సిన అవసరంలేదని కంపెనీ తెలిపింది. త్వరలోనే దీన్ని ప్రదర్శనకు పెడతామని, ఆ తేదీలను కూడా ప్రకటిస్తామని చెప్పింది.  

రేస్‌ బర్డ్‌ విశేషాలు 
పొడవు       23 అడుగులు 
వెడల్పు    6.5 అడుగులు 
బరువు      800 కిలోలు 
బ్యాటరీ     150 కిలోవాట్‌ సామర్థ్యం 
గరిష్ట వేగం    50 నాటికల్‌ మైళ్లు (గంటకు 93 కిలోమీటర్లు)   

మరిన్ని వార్తలు