మానవత్వం అంటే మనుషులకేనా?.. ఈ వీడియో ఏం చెబుతోంది!

18 May, 2022 21:04 IST|Sakshi

వైరల్‌: మనిషికి ఉంటుంది కాబట్టే.. మానవత్వమా? అదే జంతువులు సాటి జీవుల పట్ల ప్రదర్శించే దయ, సాయ గుణాల్ని ఏమనాలి?? ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన చదివాక మీరే చెప్పండి!

అరవై ఏళ్లకుపైగా వయసున్న ఓ ఏనుగు.. తనకు ఎదురుగా ఉన్న నీటికొలనులో ఓ జింక మునిగిపోవడం చూసింది. దానికి సాయం అందించాలని ప్రయత్నించినా ఆ ఏనుగు వల్ల కాలేదు. దీంతో గట్టిగా ఘీంకరించడం మొదలుపెట్టింది. భయంతో అక్కడే ఉన్న మరికొన్ని జింకలు అటు ఇటు పరుగులు తీశాయి. కానీ, ఆ ఏనుగు ఆలోచన మాత్రం వేరు.  జూ సంరక్షకుడిని అప్రమత్తం చేసే ప్రయత్నం చేసింది. 

ఏనుగు ఘీంకారాలు విన్న జూ కీపర్‌ పరుగున వచ్చి చూశాడు. నీళ్లలోకి దూకి ఆ జింకను బయటికి తీశాడు. బయటకు రాగానే చెంగున దూకుతూ.. వెళ్లి తన గుంపులో కలిసిపోయింది ఆ జింక.  జింక మునిగిపోయేంత లోతు కాకున్నా.. అది నీళ్లలో పడి కొట్టుకోవడం చూసి ఆ ఏనుగు చలించిపోయింది. 

గ్వాటెమలా నగరంలోని లా అరోరా జూలో ఈ ఘటన జరిగింది. ఏప్రిల్‌ 29వ తేదీన జరిగిన ఈ ఘటన సోషల్‌ మీడియాలో విపరీతంగా పాపులర్‌ అవుతోంది. ఆ ఏనుగును ఓ సర్కస్‌ నుంచి రక్షించి ఆ జూకి తీసుకొచ్చారట. పద్నాలుగేళ్లుగా అది జూలోనే ఉంటోంది. మనిషి ప్రమాదంలో, ప్రాణాపాయంలో ఉన్నప్పుడు చూస్తూ వెళ్లిపోయే సమాజం.. ఈ ఏనుగు నుంచి ఏం పాఠం నేర్చుకుంటోందో మరి!

మరిన్ని వార్తలు