Viral Video: ఏనుగు దాడి.. ప్రమాదం ముందున్నా ప్రశాంతంగా ఆలోచించిన డ్రైవర్‌

29 Sep, 2021 08:06 IST|Sakshi

ఎంత ప్రమాదంలో ఉన్నా.. ప్రశాంతంగా ఉండటం, సమయస్ఫూర్తితో ఆలోచించడం ఎంత అవసరమో వైరల్‌ అయిన ఓ వీడియో మనకు చెబుతోంది. అడవుల్లో సంచరించే ఏనుగుల ప్రవర్తన అంచనా వేయడం చాలా కష్టం. గజరాజులు గ్రామాలపై ఏ విధంగా దాడి చేస్తున్నాయో, పంటలను ఏ విధంగా నాశనం చేస్తున్నాయో మనం తరచూ చూస్తున్నాం. గజరాజు అనూహ్యంగా అడవి మార్గం గుండా వెళ్తున్న బస్సుపైన దాడి చేయడం అంటే.. ఎంత ప్రమాదకరమైన పరిస్థితో మనం ఊహించవచ్చు. ఇటీవల ఇలాంటి దాడి తమిళనాడులోని నీలగిరి అడవుల్లో జరిగింది.

కోటగిరి నుంచి మెట్టుపాళ్యం వెళ్తున్న ప్రభుత్వ బస్సు ముందు ద్రుడమైన ఏనుగు ఒకటి అనూహ్యంగా ప్రత్యక్షమైంది. బస్సుకు అడ్డుగా నిలిచింది. అది ఆగ్రహంగా ఉందని గ్రహించిన డ్రైవర్‌ బస్సు ఆపాడు. అద్దాలపై ఏనుగు దాడి చేసింది. అవి పగిలినా డ్రైవర్‌ కంగారు పడలేదు. బస్సులో ఉన్న వారిని వెనుకవైపునకు వెళ్లమని చెప్పాడు. బస్సు హార్న్‌ కొట్టడం గానీ, ముందుకు, వెనక్కి పోనివ్వడం గానీ చేయకుండా.. తాను కూడా సీటులోంచి లేచి వెనుకవైపునకు వెళ్లాడు. బస్సుతో తనకు ప్రమాదం లేదని గుర్తించిన ఏనుగు కొంతసేపటికి తన దారిన తాను వెళ్లిపోయింది. ఇదంతా బస్సులోని వ్యక్తి మొబైల్‌లో రికార్డు చేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. ప్రమాదకర పరిస్థితిని.. ప్రశాంతమైన ఆలోచనతో ఎదుర్కొన్న డ్రైవర్‌ సమయస్ఫూర్తిని నెటిజన్లు వేనోళ్ల కొనియాడుతున్నారు. అంతేగాక తమిళనాడు అటవీశాఖ ముఖ్య కార్యదర్శి సుప్రియా సాహు తన ట్విటర్‌ ఖాతాలో ఈ వీడియో పోస్టు చేశారు. 

చదవండి:  (చేప కోసం వలేస్తే షార్కే పడింది)

‘‘ఆగ్రహంగా ఉన్న ఏనుగు దాడి చేస్తున్నా కంగారు పడకుండా ప్రశాంతంగా ఆలోచించిన డ్రైవర్‌పై ఎనలేని గౌరవం కలిగింది. ప్రయాణికులను బస్సులో వెనక్కి పంపడం ద్వారా వారిని సురక్షితంగా ఉంచారు. అందుకనే చెబుతారు ప్రశాంతంగా ఉంటే అద్భుతాలు చేయవచ్చు అని’’ అంటూ ఆమె ట్విటర్‌లో కామెంట్‌ చేశారు. రెండు రోజుల్లోనే ఈ పోస్టును 70 వేల మందికిపైగా వీక్షించారు. పోస్టు చూసిన వారంతా డ్రైవర్‌ సమయస్ఫూర్తిని మెచ్చుకుంటున్నారు. ‘‘ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేలా డ్రైవర్లు ఉండాలి. ఇలాంటి డ్రైవర్లు ఉండటం తమిళనాడు ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌కు గర్వకారణం’’ అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు.  

చదవండి: (కరోనా పూర్తి నిర్మూలన అసాధ్యం!)

మరిన్ని వార్తలు