Elon Musk Twitter Deal: ట్విటర్‌ డీల్‌ తాత్కాలికంగా నిలిపివేత.. ఎలన్‌ మస్క్‌ ప్రకటన, కారణం ఇదే..

13 May, 2022 16:07 IST|Sakshi

ప్రపంచ అపరకుబేరుడు ఎలన్‌ మస్క్‌ మరో ట్విస్ట్‌ ఇచ్చాడు. ట్విటర్‌ డీల్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించారాయన. ఈ మేరకు తన ట్విటర్‌ అకౌంట్‌లోనే ఓ పోస్ట్‌ చేశారు.

సుమారు 44 బిలియన్‌ డాలర్లతో ట్విటర్‌-ఎలన్‌ మస్క్‌ మధ్య కొనుగోలు ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో ఆరు నెలలో పూర్తిగా ఎలన్‌ మస్క్‌ చేతికి ట్విటర్‌ వెళ్లాల్సి ఉంది. ఈలోపే ట్విటర్‌ డీల్‌ను తాత్కాలికంగా పక్కనపెడుతున్నట్లు ఎలన్‌ మస్క్‌ ప్రకటించారు. స్పామ్, నకిలీ ఖాతాలపై పెండింగ్‌లో ఉన్న వివరాల వల్లే ఈ డీల్‌ తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టాం అని ఆయన స్పష్టం చేశారు.

ఈ ప్రకటనతో మార్కెట్‌ ట్రేడింగ్‌లో ట్విటర్‌ షేర్లు పతనం అయ్యాయి. మరోవైపు ఈ డీల్‌ నిలిపివేతపై ట్విటర్‌ ఇంకా స్పందించలేదు. స్పామ్, నకిలీ ఖాతాలపై పెండింగ్‌లో ఉన్న వివరాల వల్లే ఈ డీల్‌ తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టగా..  ఇది ఐదు శాతం కంటే తక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది. గతంలో ఎలన్‌ మస్క్‌ ట్విటర్‌ నుంచి స్పాట్‌ బోట్స్‌ను తొలగించడమే తన ప్రాధాన్యత అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.

ఇదిలా ఉంటే.. మొదటి త్రైమాసికంలో.. డబ్బు ఆర్జించగల రోజువారీ క్రియాశీల వినియోగదారులలో(ట్విటర్‌ యూజర్లు) 5% కంటే తక్కువ మంది తప్పుడు లేదంటే స్పామ్ ఖాతాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని కంపెనీ ఈ నెల ప్రారంభంలో అంచనా వేసింది. మస్క్‌తో ఒప్పందం ముగిసే వరకు, ప్రకటనదారులు ట్విట్టర్‌లో ఖర్చు చేయడం కొనసాగించాలా వద్దా అనే దానితో సహా అనేక నష్టాలను ఎదుర్కొన్నట్లు కూడా పేర్కొంది.

మరిన్ని వార్తలు