విలాస భవనాలను అమ్మేసిన ఎలాన్‌ మస్క్‌

2 Jan, 2021 12:47 IST|Sakshi

వాషింగ్టన్‌ : బాగా డబ్బున్న వాళ్లకు కోపం వస్తే అంతే సంగతులు. ముందూ వెనక ఆలోచించకుండా అనుకున్నది చేస్తారు. మన ఎలాన్‌ మస్క్‌ అదే చేశారు. ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానంలో ఉన్న ఆయన ఆస్తి విలువ ‘ఫోర్బ్స్‌’ కథనం ప్రకారం 153.5 బిలియన్‌ డాలర్లు. అంటే దాదాపు కోటీ పదమూడు లక్షల కోట్ల రూపాయలు. స్వయంగా ఇంజనీరు చదువుకున్న ఎలాన్‌ మస్క్‌ టెస్లా కార్ల తయారీ కంపెనీ పెట్టి పారిశ్రామిక దిగ్గజంగా ఎదిగి ‘స్పేస్‌ ఎక్స్‌’ పేరిట రోదసి కంపెనీని కూడా ఏర్పాటు చేసి బాగా సంపాదించారు. చంద్రుడు, అంగారక గ్రహాన్ని చుట్టి వచ్చేందుకు ఆయన దగ్గర అడ్వాన్స్‌గా పలువురు కుబేరులు టిక్కెట్లు కూడా తీసుకున్నారు. ఇంతకు ఎలాన్‌ మస్క్‌కు ఎందుకు కోపం వచ్చిందంటే....అమెరికాలో భీకరంగా విజృంభిస్తోన్న కరోనాను కట్టడి చేయడం కోసం కాలిఫోర్నియా రాష్ట్రంలో పలుసార్లు లాక్‌డౌన్‌లు విధిస్తుండడంతో ఆయన తట్టుకోలేక పోతున్నారు. దాంతో గుండెల్లో రగిలిపోయి కాలిఫోర్నియా నుంచి టెక్సాస్‌కు మారిపోవాలని నిర్ణయించుకున్నారు. ( కిమ్‌.. న్యూ ఇయర్‌ గ్రీటింగ్స్‌ తెలిపారిలా.. )

అందుకని కాలిఫోర్నియాలోని తన ఏడు సుందనమైన భవనాలను 2020లో అమ్మేస్తానని గత మే నెలలోనే శపథం చేశారు. అన్నట్లుగా అప్పట్లోనే బెల్‌ ఏర్‌ ప్రాంతంలోని రెండు భవనాలను విక్రయించగా, సొమేరా రోడ్డులోని మరో మూడు భవనాలను డిసెంబర్‌ 21, డిసెంబర్‌ 22 తేదీల్లో 40.9 మిలియన్‌ డాలర్లకు అంటే, దాదాపు మూడు వందల కోట్ల రూపాయలకు విక్రయించారు. వాటిని ఓ బిల్డరు, మరో డిజైనర్‌ కొనుగోలు చేసినట్లు తెల్సింది. మరో రెండు అమ్మకానికి పెట్టిన భవనాలను అమ్మారా లేదా ? తెలియడం లేదు. కాలిఫోర్నియాలో కూడా ఆయనకు పారిశ్రామిక కేంద్రాలు ఉండడం వల్ల ఆయన అక్కడికి వెళ్లినప్పుడు ఉండడానికి వీలుగా అమ్మకుండా ఉంచుకునే అవకాశం ఉందని కొందరంటుండగా, ‘మంచయినా, చెడయిన మాట నిలబెట్టుకునే మనిషి మా ఎలాన్‌ మస్క్‌’ అని ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు.  

మరిన్ని వార్తలు