ఎలన్‌ మస్క్‌కు భారీ ఊరట.. ఆ దూకుడుకు కళ్లెం వేయడం కష్టమే!

4 Feb, 2023 12:17 IST|Sakshi

శాన్‌ ఫ్రాన్సిస్కో: దాదాపు నాలుగేళ్ల క్రిందట.. టెస్లా విషయంలో ఆ కంపెనీ సీఈవో ఎలన్‌ మస్క్‌ చేసిన ఆ ఒక్క ట్వీట్‌ ఆ కంపెనీ పెట్టుబడిదారులను బెంబేలెత్తించింది. నిర్లక్ష్యంగా ఆయన చేసిన ఆ ట్వీట్‌.. కంపెనీ షేర్లను ఘోరంగా పతనం చేసింది. వెరసి..  సొంత కంపెనీ, సొంత ఇన్వెస్టర్లు, సొంత సీఈవో పైనే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. అదీ బిలియన్ల డాలర్ల పరిహారం కోరుతూ!. కానీ, ఎలన్‌ మస్క్‌ దూకుడుకు కళ్లెం వేసేందుకు కోర్టు కూడా ఆసక్తి చూపలేదు. ఆయనకు  భారీ ఊరటే ఇచ్చింది.  

శుక్రవారం శాన్‌ఫ్రాన్సిస్కో(కాలిఫోర్నియా స్టేట్‌) కోర్టు.. ఎలన్‌ మస్క్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. తన ట్వీట్‌ ద్వారా ఎలన్‌ మస్క్‌ ఎలాంటి మోసానికి పాల్పడలేదని స్పష్టం చేసింది. తద్వారా వాటాదారులకు ఎలాంటి పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. 2018లో టెస్లా ప్రైవేట్‌ ఫండింగ్‌కు వెళ్తోందంటూ ఓ ట్వీట్‌ చేశాడు ఎలన్‌ మస్క్‌. అయితే.. కంపెనీకి వ్యతిరేకంగా పందెం వేసిన పెట్టుబడిదారులను అణిచివేసే ప్రయత్నమే అయినా.. సదరు వ్యాపారవేత్త నిర్లక్ష్యంగా వ్యవహరించారని, తద్వారా టెస్లా షేర్లు దారుణంగా పడిపోయాయని టెస్లా ఇన్వెస్టర్లు మస్క్‌పై  శాన్‌ ఫ్రాన్సిస్కో కోర్టులో దావా వేశారు.

కానీ, మస్క్‌ చేసిన ‘‘ఫండింగ్ సెక్యూర్డ్’’ ట్వీట్ సాంకేతికంగా సరికాదని మాత్రమే కోర్టు చెప్పింది తప్ప.. ఎలన్‌ మస్క్‌ ఎలాంటి నేరానికి పాల్పడలేదని, తద్వారా ఇన్వెస్టర్లకు పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.

ఇదిలా ఉంటే.. ఎలన్‌ మస్క్‌ తన ట్వీట్లతో నెటిజన్స్‌లో ‘హీరో’గా పేరు సంపాదించుకుంటున్నప్పటికీ .. టెస్లాను మాత్రం నిండా ముంచుతూ పోతున్నాడు. టెస్లాలో తన పేరిట ఉన్న అధిక వాటాలను ఇదివరకే మస్క్‌ అమ్మేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజా తీర్పుతో ఎలన్‌ మస్క్‌ ఇంకా చెలరేగిపోయే ఆస్కారం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే పలు దావాల్లోనూ మస్క్‌కి అనుకూలంగానే తీర్పులు వెలువడుతుండడం చూస్తున్నాం.

ఇక నుంచి తనకు ఏది అనిపిస్తే దానిని సోషల్‌ మీడియా వేదికగా ఎలన్‌ మస్క్‌ ప్రకటించే అవకాశం ఉందని, అది భావ స్వేచ్ఛ ప్రకటనగా పరిగణించడం ఎంతమాత్రం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 44 బిలియన్‌ డాలర్లతో ట్విటర్‌ను చేజిక్కించుకున్న ఎలన్‌ మస్క్‌.. ఆ మైక్రోబ్లాగింగ్‌ కంపెనీ వ్యవస్థను అతలాకుతలం చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు