వాళ్లు పోతే పోనివ్వండి.. ఆయన పునరాగమనం కావాలా? వద్దా?: ఆసక్తికర పోల్‌

19 Nov, 2022 08:43 IST|Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో: ఎలన్‌ మస్క్‌ మళ్లీ ఆసక్తికర చర్చ వైపు దారి తీశాడు. ఒకవైపు ట్విటర్‌ ఉద్యోగులు కంపెనీని వీడుతున్నప్పటికీ.. తనకేం ఫరక్‌ పడదని, ఉత్తమ ఉద్యోగులు తన వెంటే ఉంటారని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మరోవైపు పరోక్ష చర్యల ద్వారా అమెరికా రాజకీయాలను కదిలిస్తున్నాడు. ట్విటర్‌ వేదికగా ఈ ఉదయం ఆయన మరో ట్వీట్‌ చేశారు. 

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పునరాగమనం కావాలా? వద్దా? అంటూ ఓ పోల్‌ నిర్వహించాడు ఈ అపరకుబేరుడు. అయితే అది ట్విటర్‌ వరకే అనుకుంటే పొరపాటే!. ట్రంప్‌ తాజాగా 2024-అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మస్క్‌ చేసిన ట్వీట్‌ పరోక్షంగా ఆయన రాజకీయ పునరాగమనం గురించి అని అర్థం చేసుకోవచ్చు!.

2020 జనవరిలో క్యాపిటల్ హిల్ దాడి ఘటన తర్వాత డొనాల్డ్‌ ట్రంప్‌పై ట్విటర్‌ శాశ్వత నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే.. ఎలన్‌ మస్క్‌ ట్విటర్‌ను చేజిక్కించుకున్న తర్వాత స్వేచ్ఛకు ప్రాధాన్యత ఉంటుందని ప్రకటించాడు. ఈ క్రమంలోనే ట్రంప్‌ రీఎంట్రీ ఉండొచ్చనే సంకేతాలు అందించాడు కూడా. అయితే.. ట్విటర్‌ను మస్క్‌ టేకోవర్‌ చేయడంపై అభినందించిన ట్రంప్‌.. తిరిగి ట్విటర్‌లోకి వస్తారా? అనే విషయంపై మాత్రం సరైన స్పందన ఇవ్వలేదు. 

తాజాగా.. జరిగిన మధ్యంతర ఎన్నికల సమయంలోనూ ట్రంప్‌ ట్విటర్‌ రీ-ఎంట్రీపై జోరుగా చర్చ నడిచింది. ఈ క్రమంలో.. తాజాగా ఎలన్‌ మస్క్‌ ట్రంప్‌ ట్విటర్‌ పునరాగమనం ఉండాలా? వద్దా? అనే అంశంపై పోలింగ్‌ నిర్వహించాడు. దీనికి అవును అనే స్పందనే ఎక్కువగా లభిస్తోంది. 

ట్విటర్‌ నిషేధం అనంతరం సొంతంగా ట్రూత్‌సోషల్‌ యాప్‌ ప్రారంభించాడు డొనాల్డ్‌ ట్రంప్‌. అయితే ట్విటర్‌లో ఆయనకు దక్కిన ఫాలోయింగ్‌కంటే(బ్యాన్‌ నాటికి 80 మిలియన్‌ ఫాలోవర్స్‌).. సొంత ప్లాట్‌ఫారమ్‌లో దక్కిన ఆదరణ చాలా చాలా తక్కువ. ఒకవేళ ఆయన ట్విటర్‌ అకౌంట్‌ను గనుక పునరుద్ధరిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆయన ప్రయత్నానికి బాగా కలిసొస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఈ పోల్‌ నిర్వహణ ముందర.. ట్విటర్‌ శాశ్వత నిషేధం విధించిన మరికొన్ని అకౌంట్లను పునరుద్ధరించేందుకు సుముఖంగా ఉన్నట్లు, ట్విటర్‌ చేసే పని స్వేచ్ఛవాదులకు ఫ్రీ హ్యాండ్‌ అని అర్థం వచ్చేలా వరుస ట్వీట్లు చేశాడు ఎలన్‌ మస్క్‌.

మరిన్ని వార్తలు