అదంతా నాన్‌సెన్స్‌.. తీవ్రంగా ఖండించిన ఎలన్‌ మస్క్‌

23 May, 2022 11:24 IST|Sakshi

Fewer Kids Environment Theory: స్పేస్‌ ఎక్స్‌ అధినేత, టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో తెర మీదకు వచ్చాడు. పర్యావరణం బాగుండాలంటే.. తక్కువ సంతానం కలిగి ఉండాలంటూ వినిపించే వాదనను ఆయన తోసిపుచ్చాడు. 

ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉంటే.. అది వాతావరణానికి హాని అని అంటుంటారు. అందుకే తక్కువ మంది కనమని సలహాలిస్తుంటారు. అదంతా నాన్‌సెన్స్‌. జనాభా ఎంత పెరిగినా.. పర్యావరణానికి వచ్చిన నష్టం ఏం ఉండదు’’ అని ఆయన ఆల్‌ఇన్‌ సమ్మిట్‌( All-In Summit)లో వీడియో కాల్‌ ద్వారా వ్యాఖ్యానించారు. 

కనీసం మన సంఖ్యను కాపాడుకుందాం. అలాగని నాటకీయంగా జనాభాను పెంచాల్సిన అవసరం ఏమీ లేదు అని వ్యాఖ్యానించాడు ఏడుగురు బిడ్డల తండ్రైన ఎలన్‌ మస్క్‌. ఉదాహరణకు.. జపాన్‌లో జనన రేటు చాలా తక్కువ. కానీ, నాగరికతను కొనసాగించాలంటే.. జనాభా అవసరం ఎంతైనా ఉంది. దానిని మనం తగ్గించలేం అంటూ ఎలన్‌ మస్క్‌ వ్యాఖ్యలు చేశారు. అయితే జపాన్‌ పరిస్థితి ఇంతకు ముందు మస్క్‌ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. జపాన్‌ జనాభా తగ్గిపోవడం ఆందోళనకరమైన అంశంగా పేర్కొన్న ఆయన.. జనాభా రేటులో మార్పుతేకుంటే ఆ దేశం ఉనికికే ప్రమాదని హెచ్చరించారు కూడా.  

అభివృద్ధి చెందిన దేశాల్లో.. పిల్లలను తక్కువగా కలిగి ఉండడం వల్ల కార్బన​ ఉద్గారాల విడుదల తక్కువగా ఉంటుందని, ఒక కుటుంబంలో ఒక బిడ్డ తక్కువగా ఉంటే.. 58.6 మెట్రిక్‌ టన్నుల ఉద్గారం వెలువడకుండా ఉంటుందంటూ ఓ థియరీ ఈ మధ్య చక్కర్లు కొడుతోంది. అయితే.. మారుతున్న లైఫ్‌ స్టైల్‌, ప్రొ క్లైమాటిక్‌ పాలసీలతో ఆ ప్రభావాన్ని(కార్బన్‌ ఉద్గారాల వెలువడడం) తగ్గించొచ్చని ప్రత్యేకంగా ఓ నివేదిక వెల్లడైంది.

మరిన్ని వార్తలు