మనిషి మెదడులో చిప్‌.. న్యూరాలింక్‌ ప్రయోగాలపై ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్

6 Dec, 2022 11:49 IST|Sakshi

శాన్‌ ఫ్రాన్సిస్కో: ఎలన్‌ మస్క్‌ సొంత కంపెనీ న్యూరాలింక్‌ చిక్కులను ఎదుర్కొబోతోందా?.. అవుననే అంటున్నాయి విదేశీ మీడియా సంస్థలు. మెడికల్‌ డివైస్‌ కంపెనీ అయిన న్యూరాలింక్‌ ద్వారా జంతువులపై ఘోరమైన ప్రయోగాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందడంతో ఫెడరల్‌ దర్యాప్తు జరుగుతున్నట్లు సమాచారం. 

అయితే.. ఈ ఫిర్యాదులు చేసింది న్యూరాలింక్‌లో పని చేసే ఉద్యోగులే కావొచ్చని ప్రముఖ న్యూస్‌ ఏజెన్సీ రాయిటర్స్‌ తాజాగా ఓ కథనం ప్రచురించింది. మనిషి మెదడులో చిప్‌ అమర్చడం ద్వారా అద్భుతానికి తెర తీయాలని మస్క్‌ ఉవ్విళ్లూరుతున్నాడు. చిప్‌ ద్వారా పక్షవాతానికి గురైన వాళ్లు సైతం నడవొచ్చని, నాడీ సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చని ప్రకటించుకున్నాడు కూడా. ఈ క్రమంలో.. ఇప్పటికే చాలాసార్లు డెడ్‌లైన్‌ ప్రకటిస్తూ వచ్చాడు. తాజాగా తన మెదడులో చిప్‌ అమర్చుకునేందుకు రెడీ అని ప్రకటించాడు కూడా.

అయితే డెడ్‌లైన్స్‌ను చేరుకునే క్రమంలో ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి నెలకొందని, జంతువులపై జరిగిన ప్రయోగాలు వాటికి నరకం చూపించాయని, లెక్కకు మించి జంతువుల మరణం కూడా సంభవించిందని రాయిటర్స్ ఓ కథనం ప్రచురించింది. 2018 నుంచి న్యూరాలింక్‌ చిప్‌ ప్రయోగాల పేరిట.. 280 గొర్రెలు, పందులు, ఎలుకలు, కోతులు, చిట్టెలుకలను చంపింది. వీటి మొత్తం సంఖ్య పదిహేను వందలకు పైనేనని రాయిటర్స్‌ లెక్క గట్టింది. అయితే.. నిర్లక్ష్య పూరితంగా జరిపిన నాలుగు ప్రయోగాలపై స్పష్టత ఇచ్చే యత్నం చేసింది సదరు కథనం. ఈ నాలుగు ప్రయోగాల ద్వారా 86 పందులు, రెండు కోతులు చనిపోయినట్లు తెలిపింది. 

అయితే.. ఫెడరల్‌ దర్యాప్తు ఇవే అంశాలపై జరుగుతుందా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. అంతేకాదు జంతువుల మరణాల సంఖ్యను కూడా ఏనాడూ న్యూరాలింక్‌ ప్రకటించింది లేదు కూడా. సుమారు ఏడాది కిందట న్యూరాలింక్‌ బ్రెయిన్‌లో చిప్‌ అమర్చిన ఓ కోతి కంప్యూటర్‌ గేమ్‌ ఆడిన వీడియోను ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు