తీరు మారని అమెరికన్‌ ర్యాపర్‌.. ట్విటర్‌ వేటు.. ఎంతో ప్రయత్నించానన్న ఎలన్‌ మస్క్‌

2 Dec, 2022 16:00 IST|Sakshi

కాలిఫోర్నియా: ట్విటర్‌/ట్విట్టర్‌ శుక్రవారం మరోసారి తీవ్ర నిర్ణయం తీసుకుంది. అమెరికన్‌ ర్యాపర్‌, వ్యాపారవేత్త కాన్యే వెస్ట్‌ అలియాస్‌ ‘యే’ ట్విటర్‌ అకౌంట్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. రెండు నెలల సస్పెన్షన్‌ తర్వాత ఈమధ్యే ఆయన అకౌంట్‌ పునరుద్ధరించగా.. ఇప్పుడు మళ్లీ వేటు పడడం గమనార్హం. 

ట్విటర్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు, హింసను ప్రేరేపించేలా వ్యవహరించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విటర్‌ పేర్కొంది. మరోవైపు ట్విటర్‌ బాస్‌ ఎలన్‌ మస్క్‌కు కొందరు యూజర్లు ఈ విషయాన్ని దృష్టికి తీసుకెళ్లారు. కాన్యే వెస్ట్‌ అకౌంట్‌ను పునరుద్ధరించాలని కోరుతున్నారు. 

అయితే.. తన వంతు కృషి చేశానని చెప్పుకొచ్చారు మస్క్‌. అయినప్పటికీ, అతను(వెస్ట్‌) హింసను ప్రేరేపించడానికి వ్యతిరేకంగా మా నియమాన్ని మళ్లీ ఉల్లంఘించాడని, అందుకే అకౌంట్‌ సస్పెండ్‌ అయ్యిందని ఎలన్‌ మస్క్‌ వివరణ ఇచ్చారు. 45 ఏళ్ల కాన్యే వెస్ట్, అలెక్స్‌ జోన్స్‌ ఇంటర్వ్యూలో ముసుగుతో వచ్చి హిట్లర్‌ అంటే ఇష్టమని, ఆయన హైవేలను కనిపెట్టాడని, ఒక మ్యూజిషియన్‌గా వాడే మైక్రోఫోన్‌లను కూడా ఆయనే తీసుకొచ్చాడంటూ విచిత్రమైన వ్యాఖ్యలు చేశాడు.

కార్యక్రమంతా ముసుగులోనే ఉన్న కాన్యే వెస్ట్‌.. యూదుల్ని ఇష్టపడతా అంటూనే నాజీలను వెనకేసుకొచ్చాడు.ఈ  క్రమంలో హిట్లరపై ప్రశంసలు గుప్పించారు. యూదులను హిట్లర్‌ చంపించాడన్న వాదనతో తాను ఏకీభవించబోనని చెప్పాడాయన. అంతేకాదు.. స్వస్తిక్‌ గుర్తును పోస్ట్‌ చేసినందుకే ఈసారి ట్విటర్‌ నుంచి వేటు పడినట్లు తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే.. వాక్ స్వాతంత్ర్య నిరంకుశుడిగా తనను తాను అభివర్ణించుకునే ఎలన్‌ మస్క్‌.. ర్యాపర్‌ కాన్యే వెస్ట్‌ అకౌంట్‌ పునరద్ధరణను స్వాగతించాడు గతంలో. అయితే అది మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. లైంగిక వేధింపులు మాత్రమే కాదు.. విద్వేషపూరిత వ్యవహార శైలితో కాన్యే వెస్ట్‌ ట్విటర్‌ నుంచి గత కొంతకాలంగా ఆంక్షలు ఎదుర్కొంటున్నాడు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నాడు వెస్ట్‌.

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు