13 గంటలు గగన ప్రయాణం.. చివరికి ఊహించని ల్యాండింగ్‌.. ప్రయాణికుల షాక్‌

31 Jan, 2023 09:18 IST|Sakshi

దుబాయ్‌: సుమారు 13 గంటల పాటు గాల్లో ప్రయాణించిన విమానం.. చివరకు ఊహించని ల్యాండింగ్‌ అయ్యింది. ఎక్కడి నుంచి విమానం టేకాఫ్‌ అయ్యిందో.. చివరికి మళ్లీ అక్కడే విమానం దిగేసరికి ప్రయాణికులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఈ అసాధారణమైన ఈ ఘటన గత శుక్రవారం చోటుచేసుకుంది. 

దుబాయ్‌ నుంచి న్యూజిలాండ్‌కు వెళ్లాల్సిన ఎమిరేట్స్‌ విమానం ఒకటి 13 గంటలపాటు ప్రయాణించి.. చివరికి మళ్లీ వెనక్కి వచ్చేసింది. స్థానిక కాలమానం ప్రకారం.. శుక్రవారం ఉదయం 10.30 ప్రాంతంలో ఈకే 448 అనే ఎమిరేట్స్‌ విమానం టేకాఫ్‌ అయ్యింది. అయితే.. సగం దూరం వెళ్లాక వెనక్కి వచ్చేసి మళ్లీ దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌లోనే ల్యాండ్‌ అయ్యింది. అర్ధ రాత్రి జరిగిన ఈ పరిణామం.. అనౌన్స్‌మెంట్‌తో ప్రయాణికులంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. 

అక్లాండ్‌(న్యూజిలాండ్‌) ఎయిర్‌పోర్ట్‌ వరదలతో మునిగిపోవడంతో మూసేశారు నిర్వాహకులు. ఈ సమాచారం అందుకున్న పైలట్‌.. ఎమిరేట్స్‌ విమానాన్ని వెనక్కి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం 9వేల మైళ్ల దూరం ఉన్న ప్రయాణంలో అప్పటికే సగానికి పైగా దూరం విమానం ప్రయాణించేసింది కూడా. అయితే.. అక్లాండ్‌ ఎయిర్‌పోర్ట్‌ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. అయినప్పటికీ ప్రయాణికుల భద్రతే తమకు ప్రాధాన్యమని ఒక ప్రకటన విడుదల చేసింది.

 ఇదిలా ఉంటే తీవ్ర వరదలతో మునిగిపోయిన అక్లాండ్‌ను ఎయిర్‌పోర్ట్‌ను.. జనవరి 29 నుంచి తిరిగి కార్యకలాపాలను పునరుద్ధరించారు.  

మరిన్ని వార్తలు