ఈ మగ పిట్ట పాడటం మర్చిపోయిందట..అందుకే

23 Mar, 2021 08:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  ఎప్పుడైనా మీరు పాడుకునే పాటలు మర్చిపోయారా? ఆ అవును.. మర్చిపోతాం.. అయినా అందులో పెద్ద సమస్య ఏముంటది అనే కదా మీ ప్రశ్న. అవును మనకు ఏ సమస్యా ఉండదు. ఒకటి కాకపోతే ఇంకో పాట పాడుకుంటాం. అయితే ఇలాంటి ఓ సమస్యే ఈ పక్షికి వచ్చిపడింది. అదేంటంటే తాను పాడుకునే పాట మర్చిపోయిందట. ఇలా పాట పాడటం మర్చిపోవడం వల్ల ఈ పక్షి జాతికి పెద్ద చిక్కే వచ్చిపడింది. ఏకంగా ఆ జాతి మొత్తం అంతరించిపోయే ప్రమాదం ముంచుకొచ్చింది. ఎందుకంటే ఆడ పక్షిని ఆకర్షించేందుకు మగ పక్షులు మధురంగా ఓ పాట అందుకుంటాయట. అయితే మగ పక్షులు సరైన శ్రుతిలో పాడటం మర్చిపోయాయట. దీంతో ఆడపక్షులు మగ పక్షుల దగ్గరకు రావట్లేదట. దీంతో వాటి సంతతి అభివృద్ధి చెందక.. చివరికి అంతరించిపోయే దాకా పరిస్థితి వచ్చింది. ఇంతకీ వీటి పేరేంటో చెప్పలేదు కదా.. ‘రీజెంట్‌ హనీఈటర్‌’ అని పిలిచే ఈ పక్షులు ఆస్ట్రేలియాలో ఒకప్పుడు చాలా ఉండేవట. ఇప్పు డు ప్రపంచం మొత్తం కూడా 300 పక్షులు మాత్రమే ఉన్నాయట. దీంతో పక్షి శాస్త్రవేత్తలు ఇందుకు కారణాలు వెతకగా.. మగ పక్షులు పాట పాడటం మర్చి పోయిన విషయం గుర్తించారు. 

గత ఐదేళ్లుగా పర్యావరణ శాస్త్రవేత్త రాస్ క్రేట్స్  దీనిపై పరిశోధన నిర్వహించగా రీజెంట్ హనీయేటర్స్ పాటల సామర్థ్యం  సంతానోత్పత్తి  సామర్థ్యం క్షీణిస్తున్న విషయాన్ని గుర్తించారు. ఈ విలక్షణమైన నలుపు ,పసుపు రంగులమిశ్రమంతో ఆకర్షణీయంగా కనిపించే పక్షులు ఒకప్పుడు ఆస్ట్రేలియా అంతటా సాధారణం, కానీ 1950 ల నుండి వీటి సంఖ్య తగ్గిపోతూ వస్తోందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పక్షులకు మా త్రమే సొంతమైన పాటను పాడకుండా.. అనుకోకుండా వేరే పక్షుల శబ్దాలను, పాటలను అనుకరించడం ప్రారంభించాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి తక్కువ సంఖ్యలో ఉండటం వల్ల కొంతకాలానికి అవి చేయాల్సిన శబ్దాలను గుర్తు చేసుకోలేకపోయాయని పేర్కొన్నారు. పుట్టిన పిల్ల పక్షులు కూడా వేరే శబ్దాలను నేర్చుకుంటున్నాయని, దీంతో ఆడ పక్షులు ఈ పాటలకు ఆకర్షితం కావడం లేదని విశ్లేషించారు. 
 

మరిన్ని వార్తలు