ఎరక్కపోయి ఇరుక్కు పోయాడు!

11 Feb, 2021 07:55 IST|Sakshi

నేటి తరం పిల్లలు ఒక పట్టాన ఏదీ నమ్మరు. స్వయంగా తమంతట తాము స్వయంగా తెల్సుకుంటేగాని ఒక నిర్ణయానికి రారు. ఈ కోవకు చెందిన వాడే మనం చెప్పుకోబోయే చిచ్చరపిడుగు రిలేమోరిసన్‌. ఇంగ్లాండ్‌లోని గ్రేట్‌ మాంచెస్టర్‌కు చెందిన 12 ఏళ్ల మోరిసన్‌ 54 మ్యాగ్నటిక్‌ బాల్స్‌ మింగి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. ఆయస్కాంతం ఇనుమును ఆకర్షిస్తుందని లె లుసుకున్న మోరిసన్‌ .. మాగ్నెట్‌తో తయారు చేసిన బాల్స్‌ను మింగితే.. తన పొట్ట అయస్కాంతంలా పనిచేస్తుందని అనుకున్నాడు. అసలు అది ఎంతవరకు పనిచేస్తుందో తెలుసుకునేందుకు జనవరి 1న కొన్ని బాల్స్, నాలుగున... కొన్ని... మొత్తం 54 మ్యాగ్నటిక్‌ బాల్స్‌ను మింగేసాడు.

మింగిన తరువాత ఒక ఐరన్‌ స్టిక్‌ను తన పొట్ట మీద ఉంచాడు. ఎంతకీ అది అయస్కాంతానికి ఆతుక్కోక పోవడంతో.. తాను మింగిన బాల్స్‌ టాయిలెట్‌లో పడిపోయాయేమోనని వాష్‌రూమ్‌కు వెళ్లి చూశాడు. అక్కడ ఏమీ కనిపించకపోవడంతో కంగారుపడిపోయాడు. వాటిని ఎలా బయటికి తీయాలో తెలియక నానా అవస్థలు పడిన మోరిసన్‌ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో వాళ్ల అమ్మ పైజ్‌వార్డ్‌ను నిద్రలేపి పొరపాటున రెండు మ్యాగ్నటిక్‌ బాల్స్‌ను మింగానని చెప్పాడు. వెంటనే మోర్సిన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లిన పైజ్‌కు విస్తుపోయే నిజం తెలిసింది.
చదవండి: రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన కుక్క!
కూలో చేరిన కంగనా: ట్విటర్‌కు కౌంటర్‌

డాక్టర్లు ఎక్స్‌రే తీసి మొత్తం 54 బాల్స్‌ ఉన్నాయని చెప్పారు. ఇవి కడుపులో అలాగే ఉండిపోతే వేరే అవయవాలు పాడై ప్రాణం పోయే అవకాశం ఉందని, వెంటనే ఆపరేషన్‌ చేయాలని చెప్పి సర్జరీని ప్రారంభించారు. ఆరుగంటల పాటు నిర్విరామంగా సర్జరీ చేసి మోరిసన్‌ మింగిన బాల్స్‌ అన్నింటినీ బయటకు తీశారు. అప్పటికీ మోరిసన్‌ పూర్తిగా కోలుకోలేదు. హాస్పిటల్‌లో 10 రోజుల పాటు ఉండిపోవలసి వచ్చింది. పేగుకు రంధ్రం పడడం వల్ల ఆకుపచ్చని ద్రవం ఒకటి విడుదలవ్వడంతో దానిని పూర్తిగా కక్కిన తరువాత గాని అతను కదల్లేకపోయాడు. ఈ సమయంలో అతనికి ట్యూబ్‌ ద్వారా ఆహారం అందించారు. రెండు వారాలు తరువాత పూర్తిగా కోలుకుని డిచార్జ్‌ అయ్యాడు మోరిసన్‌.

మోరిసన్‌కు సైన్స్‌ అంటే ఎంతో ఆసక్తి. ప్రయోగాలు చేయడం అంటే ఎంతో ఇష్టం. అందుకే కడుపులో మ్యాగ్నెటిక్‌ బాల్స్‌ ఉంటే ఐరన్‌ స్టిక్‌ తన పొట్టకు అతుక్కుంటుందా లేదా అనే∙విషయం తెలుసుకోవడానికి ఇలా చేసానని మోరిసన్‌ చెప్పినట్లు తల్లి చెప్పారు. ఈ విషయం మనకు చాలా సిల్లీగా అనిపించవచ్చు కానీ మోరిసన్‌ చాలా చిన్నవాడు కావడంతో ఇలా చేసాడని ఆమె వివరించారు.

>
మరిన్ని వార్తలు