పైలట్లు ఇద్దరూ నిద్రపోయారు.. గమ్యస్థానం దాటేసిన తర్వాత మేలుకున్నారు!

20 Aug, 2022 05:39 IST|Sakshi

అడీస్‌ అబాబా:  ప్రయాణంలో ప్రతిక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వే పై విమానాన్ని భద్రంగా దించాల్సిన పైలట్లు హాయిగా నిద్రపోయారు. గమ్యస్థానం దాటేసిన తర్వాత విమానంలో అలారం మోగాక హఠాత్తుగా నిద్ర నుంచి మేలుకున్నారు. ఆఫ్రికా ఖండంలోనే అతి పెద్దదైన ఇథియోపియన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737 ఈటీ343 విమానం ఈ నెల 15వ తేదీన సూడాన్‌ నుంచి ఇథియోపియాకు బయలుదేరింది. షెడ్యూల్‌ ప్రకారం అడీస్‌ అబాబా విమానాశ్రయంలో ల్యాండ్‌ కావాల్సి ఉంది.

అయితే, అందులోని ఇద్దరు పైలట్లు నిద్రలోకి జారుకున్నారు. అడీస్‌ అబాబాకు చేరుకున్నా లేవలేదు. ఆ సమయంలో విమానం 37,000 అడుగుల ఎత్తున ఆకాశంలో దూసుకెళ్తోంది. రన్‌ వేపై దిగాల్సిన జాడ లేకపోవడంతో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిబ్బంది అప్రమతమయ్యారు. పైలట్లను సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఫ్లైట్‌లోని అలారం మోగించారు. ఆ శబ్దానికి పైలట్లు కళ్లు తెరిచారు. జరిగిన పొరపాటు గుర్తించారు. అధికారుల సూచనతో విమానాన్ని వెనక్కి మళ్లించి, ఎయిర్‌పోర్ట్‌లో దించారు.

మరిన్ని వార్తలు