పగవారికీ రావొద్దీ కష్టం.. ఈయూ సాయం మరువలేనిది.. గణాంకాలివే!

21 Mar, 2022 10:48 IST|Sakshi

ఉక్రెయిన్‌ శరణార్థులను అక్కున చేర్చుకుంటున్న యూరప్‌

రష్యా నిర్దాక్షిణ్యంగా కురిపిస్తున్న బాంబుల వర్షానికి గూడు చెదిరిపోయింది. శిథిల దృశ్యాలను చూస్తూ గుండె పగిలిపోతోంది. యుద్ధం ఊరు విడిచి వెళ్లిపొమ్మంటోంది. మగవాళ్లు దేశ రక్షణ కోసం ఆగిపోతుంటే మహిళలు పిల్లాపాపలతో, కట్టుబట్టలతో వలసబాట పట్టారు. వీరిని యూరప్‌ అక్కున చేర్చుకుంటోంది...

కనీవినీ ఎరుగని మానవీయ సంక్షోభంతో ఉక్రెయిన్‌ అల్లాడిపోతోంది. రష్యా దాడి మొదలైనప్పటి నుంచి దేశం విడిచిన వారి సంఖ్య 33 లక్షలు దాటేసింది. వీరిలో 90 శాతం మంది మహిళలు, పిల్లలే ఉన్నారు. లక్షలాది మంది సరిహద్దుల్లో పడిగాపులు కాస్తున్నారు. ఇక దేశంలో నిరాశ్రయులైన వారు 65 లక్షల దాకా ఉంటారని ఐరాస హక్కుల మండలి అంచనా.

‘‘ఎప్పుడు ఏ బాంబు వచ్చి మీద పడుతుందో తెలియని దుర్భర పరిస్థితుల్లో ఉన్న జనం వలస బాట పట్టారు. యుద్ధం ఆగితే తప్ప వలసలు ఆగేలా లేవు’’ అని యూఎన్‌హెచ్‌ఆర్‌సీ చీఫ్‌ ఫిలిప్పో గ్రాండీ అన్నారు. ఉక్రెయిన్‌లో మహిళల కష్టాలు వర్ణనాతీతం! ‘‘కరెంట్‌ లేదు. ఇంట్లో వండుకోవడానికి ఏమీ లేవు. నరకం భరించలేక నానాకష్టాలకోర్చి వలస వచ్చా’’ అని ఓల్హా అనే మహిళ కన్నీరుమున్నీరైంది.

శరణార్థులుగా మారితే అల్లకల్లోలం
ఉక్రెయిన్‌ వలసలను చూసి ఇతర దేశాల్లోని శరణార్థులూ చలించిపోతున్నారు. ఈ బాధలు పగవారిక్కూడా వద్దని 13 ఏళ్లప్పుడే సిరియా నుంచి అమెరికా వలస వచ్చిన నిడా అల్‌జబౌరిన్‌ చెప్పింది. చిన్నవయసులో శరణార్థులుగా మారితే జీవితం అల్లకల్లోలమవుతుందని ఆవేదన వెలిబుచ్చింది. చిన్నారులను నేరస్తుల ముఠాలు ఎత్తుకెళ్లే ప్రమాదముందని యునిసెఫ్‌ హెచ్చరించింది.

యూరోపియన్‌ యూనియన్‌ సాయం ఇలా  
ఉక్రెయిన్‌ ప్రాణాలరచేతుల్లో పెట్టుకొని వస్తున్న వారిని యూరోపియన్‌ యూనియన్‌ అక్కున చేర్చుకుంటోంది. ఎక్కడికక్కడ రిసెప్షన్‌ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రభుత్వపరంగా నిత్యావసరాలు అందిస్తోంది. మంచి ఆహారం, వైద్య సదుపాయాలతో పాటు సంక్షేమాన్ని కూడా చూస్తోంది. పిల్లలకు స్కూళ్లలో సీట్లు కూడా ఇవ్వనుంది. 27 ఈయూ దేశాలు శరణార్థులకు మూడేళ్ల పాటు ఉండే అవకాశం కల్పించాయి. అమెరికాలోకి శరణార్థులెవరూ రాకపోయినా మానవతా సాయం కింద ఉక్రెయిన్‌కు ఇప్పటికే 400 కోట్లకు డాలర్లకు పైగా అందించింది. అందులో 104 కోట్ల డాలర్లు శరణార్థులకు ప్రత్యేకించింది.

► ఉక్రెయిన్‌ నుంచి అత్యధికంగా పోలండ్‌కు 20 లక్షల మందికి పైగా వలస వెళ్లారు
► 5 లక్షల మంది రుమేనియాకు వెళ్లారు
► మాల్దోవాకు 4 లక్షల మంది వెళ్లారు. ఇక్కడ్నుంచి వేరే దేశాలకు వెళ్తున్నారు.
► 3 లక్షల మంది హంగరీ వెళ్లినట్టు గణాంకాలు చెప్తున్నాయి
► స్లొవేకియాకు 2.5 లక్షల మంది వెళ్లారు

– నేషనల్‌ డెస్క్, సాక్షి

మరిన్ని వార్తలు