సూర్యుడికి ఆయుక్షీణం

19 Aug, 2022 04:57 IST|Sakshi

మిగిలింది మరో 457 కోట్ల సంవత్సరాలే  

లండన్‌: జగతికి వెలుగునిస్తూ భూగోళంపై జీవజాలం మనుగడకు ఆధారభూతమైన సూర్యుడి ఆయువు క్రమంగా తగ్గిపోతోందట. సూర్యగోళం జీవితకాలం మరో 457 కోట్ల సంవత్సరాలేనని, ఆ తర్వాత అదొక కాంతిహీనమైన తెల్లటి మరుగుజ్జు గ్రహంగా మిగిలిపోతుందని యూరోపియన్‌ అంతరిక్ష సంస్థ(ఈఎస్‌ఏ) చెబుతోంది. భానుడి జీవితకాలం సగం ముగిసిపోయిందని, మరో సగమే మిగిలి ఉందని పేర్కొంటోంది. ఈ ఏడాది జూన్లో విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాన్ని బహిర్గతం చేసింది.

అంతరిక్ష పరిశోధనల కోసం ఈఎస్‌ఏ ప్రయోగించిన గైయా స్పేస్‌ అబ్జర్వేటరీ(స్పేస్‌క్రాఫ్ట్‌) భానుడి జీవితకాలాన్ని లెక్కగట్టింది. మన సౌర వ్యవస్థలో కేంద్ర స్థానంలో ఉన్న సూర్యుడు నిరంతరం మండే ఓ అగ్నిగోళం. అందులో సౌర తుపాన్లు సంభవిస్తుంటాయి. అత్యధిక శక్తి వెలువడుతుంది. సూర్యుడి ఆయువు క్షీణిస్తుండడానికి కారణం ఏమిటంటే.. అందులోని హైడ్రోజన్‌ నిల్వలే. సూర్యుడి ఉపరితలం ఉన్న హైడ్రోజన్‌ హీలియం వాయువులో సంలీనం చెందుతూ ఉంటుంది.

ఫలితంగా ఉష్ణం ఉద్గారమవుతుంది. భవిష్యత్తుతో హైడ్రోజన్‌ హీలియంలో సంలీనం చెందకుండా సూర్యుడి కేంద్ర స్థానం వైపు వెళ్తుందట! దాంతో సూర్యుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోతాయి. సూర్యగోళం మొత్తం వయసు 10,110 కోట్ల సంవత్సరాలు అనుకుంటే, 800 కోట్ల సంవత్సరాల వయసు నాటికి గరిష్ట ఉష్ణోగ్రతకు చేరుకుంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అనంతరం ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుముఖం పడుతుందని, పరిమాణం తగ్గిపోతుందని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు