ఈయూ ఆంక్షల మోత...టెన్షన్‌లో రష్యా!

15 Jul, 2022 17:48 IST|Sakshi

EU said it will look into sanction regime on gold: ఉక్రెయిన్‌ పై దురాక్రమణ యుద్ధంకు దిగడంతో ఈయూ దేశాలు ఇప్పటికే రష్యా పై ఆంక్షలు మోత మోగించింది. అయినా రష్యా దూకుడు మాత్రం ఆగలేదు. పైగా ఉక్రెయిన్‌ పై మరిన్ని యుద్ధ నేరాలకు పాల్పడింది రష్యా. అంతేకాదు ఉక్రెయిన్‌ స్వాధీన దిశగా దాడులు వేగవంతం చేసింది కూడా. దీంతో రష్యాను నియంత్రించేలా మరిన్ని ఆంక్షలను విధించే దిశగా ఈయూ రెడీ అవుతోంది. అందులో భాగంగానే ఈయూ రష్యా ఎగుమతులకు సంబంధించిన ముఖ్యమైన వాటిపై దృష్టి కేంద్రీకరించింది. ఈ మేరకు రష్యా బంగారం ఎగుమతులను లక్ష్యంగా చేసుకుని ఆంక్షలు విధించనున్నట్లు ఈయూ కమిషన్‌ అధికారి తెలిపారు.

ఇప్పటి వరకు ఈయూ రష్యా పై ఆరు ఆంక్షల ప్యాకేజిని విధించింది. ఈ మేరకు ఈయూ రష్యాకి సంబంధించి ఎగుమతులలో ముఖ్యమైనది అయిన బంగారం పై ఆంక్షలు విధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు యూరోపియన్‌ కమిషన్‌ హెడ్‌ మారోస్‌ సెఫ్కోవిక్‌ తెలిపారు. తాము సభ్యదేశాల స్థాయిలో ఒప్పందానికి వచ్చిన వెంటనే ఈ విషయాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు. అదీగాక ఉక్రెయిన్‌ ఉప ప్రధాని ఓల్గా స్టెఫనిషినా కూడా రష్యా పై కొత్త ఆంక్షల ప్యాకేజిని ఆమోదించాలని కోరారు.

అయినా ఇప్పటివరకు ఇన్ని ఆంక్షలు విధించినా రష్యాలో ఏ మాత్రం మార్పు రాలేదని, పైగా తాను చేసి దురాగతాలకు జవాబుదారీగా భావించేలా కూడా ఏం చేయలేదన్నారు. ఇప్పుడు విధించనున్న ఆంక్షలు రష్యాని గట్టిగా నియంత్రించగలదని ఆశిస్తున్నానని, సాధ్యమైనంత త్వరితగతిన ఈ ఆంక్షలు ఆమోదించాలని కోరుకుంటున్నానని అన్నారు. 

(చదవండి: రాజపక్స కుటుంబానికి బిగ్‌ షాక్‌.. దేశం విడిచి వెళ్లకుండా నిషేధాజ్ఞలు)

మరిన్ని వార్తలు