మిత్రదేశాలు కూడా పాక్‌ను బిచ్చగాడిగా చూస్తున్నాయ్‌.. పాక్‌ ప్రధాని ఆవేదన

16 Sep, 2022 07:20 IST|Sakshi

ఇస్లామాబాద్‌: నానాటికీ దిగజారుతున్న పాకిస్తాన్‌ ఆర్థిక పరిస్థితిని దేశ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ కళ్లకు కట్టారు. మిత్రదేశాలు కూడా పాకిస్తాన్‌ను అడుక్కునే దేశంగానే చూడటం మొదలుపెట్టాయంటూ విచారం వ్యక్తం చేశారు. బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో లాయర్లనుద్దేశించి ఆయన మాట్లాడారు.

‘మనతో సన్నిహితంగా ఉండే ఏ దేశానికి వెళ్లినా, వారికి ఫోన్‌ చేసినా అడుక్కోటానికే అని అనుకుంటున్నారు. చాలా చిన్న దేశాలు కూడా అభివృద్ధిలో పాక్‌ను దాటేసి పోయాయి. మనం మాత్రం 75 ఏళ్లుగా జోలె పట్టుకుని తిరుగుతూ బిచ్చమెత్తుకుంటున్నాం’ అని వ్యాఖ్యానించారు. ఇంతకు ముందు కూడా దేశం పరిస్థితి ఇదే, వరదలతో ఇప్పుడు మరింత తీవ్రంగా మారిందన్నారు.  

తాజా వరదల నేపథ్యంలో పొరుగు మిత్ర దేశం చైనా కేవలం సాయ ప్రకటనకే పరిమితం అయ్యింది. తమ దగ్గర సంభవించిన స్వల్ప కరువును, కరోనా-లాక్‌డౌన్‌ పరిస్థితులను చూపుతూ పాక్‌ సాయం విషయంలో చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో షెహబాజ్‌ కామెంట్లు పరోక్షంగా చైనా మీదేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఇదీ చదవండి: దేశాభివృద్ధి పథంలో అమెరికా కీలక పాత్ర- ప్రధాని మోదీ

మరిన్ని వార్తలు