కరోనా ఎవరినీ వదిలి పెట్టదు : బ్రెజిల్ అధ్యక్షుడు

1 Aug, 2020 19:48 IST|Sakshi
ఫైల్ ఫోటో

బ్రసిలియా: బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. దురదృష్టవశాత్తు ప్రతి ఒక్కరూ బహుశా ఏదో ఒక సమయంలో కరోనావైరస్ మహమ్మారి బారిన పడక తప్పదని ఆయన పేర్కొన్నారు. వైరస్ ఎవరినీ వదిలిపెట్టదు..కాబట్టి భయం వద్దు దాన్ని ఎదుర్కోండి అంటూ చెప్పుకొచ్చారు. కరోనా మరణాల పట్ల విచారాన్ని వ్యక్తం చేసిన ఆయన ప్రతిరోజు చాలా కారణాలతో జనం చనిపోతారు. అదే జీవితం అంటూ వేదాంత ధోరణి ప్రదర్శించడం గమనార్హం. కరోనావైరస్ నిర్ధారణ తరువాత బలహీనంగా ఉన్నానని, యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నానని బోల్సొనారో చెప్పిన ఒక రోజు తర్వాత శుక్రవారం దక్షిణ రియో ​​గ్రాండే దో సుల్ రాష్ట్ర పర్యటన సందర్భంగా విలేకరులతో ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో కోవిడ్-19 ఒక సాధారణ ఫ్లూ లాంటిదే నని వ్యాఖ్యానించిన బోల్సొనారో, ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగిస్తుందంటూ లాక్ డౌన్ ను వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. 

జూలై 7న బోల్సొనారోకు కరోనా సోకింది. 20 రోజులకు పైగా హోం ఐసోలేషన్ లో ఉంటూ అధికారిక నివాసం నుంచే కార్యకలాపాలను చక్కబెట్టారు. 18 రోజుల్లో మూడుసార్లు పాజిటివ్ రాగా గత శనివారం నాల్గవసారి నెగిటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇంతలోనే ఆయన భార్య, ప్రథమ మహిళ మిచెల్ బోల్సొనారోకు వైరస్ సోకింది. అలాగే ఆయన ఇద్దరు సహాయకులతోపాటు సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ మంత్రి మార్కోస్ పోంటెస్ కు పాజిటివ్ వచ్చిందని అధ్యక్ష భవనం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఇప్పటివరకు ఐదుగురు క్యాబినెట్ మంత్రులు ఈ వైరస్ బారిన పడ్డారు. కాగా బ్రెజిల్ ప్రభుత్వ సమాచారం ప్రకారం దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 2,662,485 గా ఉండగా, 92,475 మరణాలు సంభవించాయి.  (బ్రెజిల్ అధ్యక్షుడికి కరోనా)

మరిన్ని వార్తలు