లంచం కేసులో చైనా కోర్టు సంచలన తీర్పు

5 Jan, 2021 19:05 IST|Sakshi

లంచం తీసుకున్నందుకు ఉరిశిక్ష

బీజింగ్‌: లంచం ఎన్నో సందర్బాల్లో ఎంతో మంది జీవితాల్లో పెను విషాదాలు నింపింది. మన దేశంలో లంచగొండి అధికారుల వేధింపులు తాళలేక ఎందరో ప్రభుత్వ కార్యాలయాల ముందే ప్రాణాలు తీసుకున్న ఘటనలు కోకొల్లలు. ఇక లంచగొండులకు వ్యతిరేకంగా ఎన్ని చట్టాలు తెచ్చినా మార్పు మాత్రం శూన్యం. ఈ క్రమంలో ఓ లంచగొండి అధికారికి ఉరి శిక్ష విధించిన వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే ఇది మన దగ్గర కాదు.. చైనాలో. వివరాలు.. లంచం, అవినీతి కేసులో చైనా ప్రభుత్వ మాజీ అధికారి‌ లై షియామిన్‌కు అక్కడ న్యాయస్థానం మంగళవారం మరణశిక్ష విధించింది. మొత్తం 260 మిలియన్ డాలర్ల మేర అవినీతికి పాల్పడినట్టు న్యాయస్థానం నిర్ధారించింది.

చైనా అతిపెద్ద ప్రభుత్వ-నియంత్రిత ఆర్ధిక నిర్వహణ సంస్థకు లై షియోమిన్ గతంలో ఛైర్మన్‌గా వ్యవహరించారు. కమ్యూనిటీ పార్టీ మాజీ సభ్యుడైన లై షియామిన్ గతేడాది జనవరిలో అధికార మీడియా సీసీటీవీలో తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించారు. బీజింగ్‌‌లోని తన అపార్ట్‌మెంట్‌లో ఉన్న లాకర్లను తెరిచిన అధికారులు.. అందులో బయటపడ్డ నగదు చూసి షాక్‌ అయ్యారు. అక్రమమార్జన కోసం లై తన హోదాను దుర్వినియోగం చేశాడని తియాంజిన్ కోర్టు వ్యాఖ్యానించింది. ఆయన లంచం తీసుకున్న చర్యను ‘చాలా పెద్ద’ నేరంగా, తీవ్రమైనదగా కోర్టు అభిప్రాయపడింది. ఇక లై ఉద్దేశపూర్వకంగా తీవ్రమైన హానికారక చర్యకు పాల్పడ్డారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. (చదవండి: నడి రోడ్డు మీద లంచావతారం..)

హాంగ్‌కాంగ్‌-లిస్టెడ్ చైనా హువారోంగ్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ మాజీ ఛైర్మన్ అయిన లై.. మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించి, చట్టవిరుద్ధంగా పిల్లలను కన్నట్టు నిర్ధారణ అయ్యింది. హువారంగ్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి ఛైర్మన్‌గా ఉంటూ 2009 నుంచి 2018 మధ్య 3.8 మిలియన్ డాలర్ల మేర ప్రజా ధనాన్ని అపహరించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో 2018 ఏప్రిల్‌లో ఆయనపై దర్యాప్తు ప్రారంభమయ్యింది. టెలివిజన్ లైవ్‌లో తన నేరాన్ని అంగీకరించిన లై.. మొత్తం డబ్బును దాచిపెట్టానని, అందులోది ఒక్క పైసా కూడా తాను ఖర్చుచేయలేదు.. దానికి తనకు ధైర్యం సరిపడలేదని తెలిపారు. (చదవండి: శంకరయ్య.. 4.58 కోట్లు.. 11 ప్లాట్లు..)

లంచంగా లై ఖరీదైన కార్లు, బంగారు బిస్కెట్లను తీసుకున్నట్టు అంగీకరించారు. లై వ్యక్తిగత ఆస్తులన్నీ జప్తు చేసి, తన రాజకీయ హక్కులను స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశించింది. అయితే, జీ జిన్‌పింగ్ ఆధ్వర్యంలో ప్రారంభించిన అవినీతి నిరోధక ప్రచారం తన ప్రత్యర్థులను, కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి ఒక మార్గంగా ఉపయోగపడిందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. సీసీటీవీ తరచూ నేరాలకు పాల్పడే నిందితులతో ఇంటర్వ్యూలను ప్రసారం చేస్తుంది. వారు కోర్టులో హాజరుకాకముందే బలవంతంగా నేరాన్ని ఒప్పుకునేలా ప్రేరేపించడాన్ని న్యాయవాదులు, హక్కుల కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు.

మరిన్ని వార్తలు