సంచలన వ్యాఖ్యలు చేసిన ఇజ్రాయెల్‌ స్పేస్‌ హెడ్‌

8 Dec, 2020 12:30 IST|Sakshi

అమెరికా, ఇజ్రాయెల్‌ ప్రభుత్వాలతో కలిసి పని చేస్తున్నాయి

ట్రంప్‌ దీని గురించి ప్రకటించాలనుకున్నాడు

గ్రహాంతర వాసుల కోసం ప్రత్యేకంగా ‘గెలాక్సీ ఫెడరేషన్‌’

జెరూసలెం: అంతరిక్షం, ఏలియన్స్ వంటి విషయాలు ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయి. ఇక హాలీవుడ్‌లో ఏలియన్స్‌ ఆధారిత సినిమాలు ఎంతటి విజయాన్ని సాధించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఏరియా 51 అనే ప్రాంతంలో అమెరికా సైన్యం గ్రహాంతరవాసులను బంధించి పెట్టింది. వాళ్ల నుంచే అధునాతన టెక్నాలజీని ఆ దేశం పొందుతోంది అనే ఆరోపణలు ఏన్నో ఏళ్లుగా ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ ఇజ్రాయేల్‌ మాజీ జనరల్‌ ఏలియన్స్‌ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రహంతార వాసులు నిజంగానే ఉన్నారని.. భూమ్మీద మనతో పాటు కలిసి తిరుగుతున్నారన్నారు. మాజీ ఇజ్రాయెల్ జనరల్, ప్రస్తుతం ప్రొఫెసర్‌గా పని చేస్తున్న హైమ్ ఎషెడ్ ఒక ఇంటర్వ్యూలో ఏలియన్స్‌ నిజంగానే ఉన్నారని.. వారు రహస్యంగా మన ప్రభుత్వాలతో కలిసి పని చేస్తున్నారని.. వారి సమయాన్ని మనతో వెచ్చిస్తున్నారని తెలిపారు. అంతేకాక అమెరికా, ఇజ్రాయేల్‌ ప్రభుత్వాలు ఎన్నో ఏళ్లుగా ఏలియన్స్‌తో కలిసి పని చేస్తున్నాయని వెల్లడించారు. అయితే భూమ్మీద వారిని అంగీకరించే పరిస్థితులు లేనందున ఈ విషయాలని రహస్యంగా ఉంచారని జెరూసలేం పోస్టుకిచ్చిన ఇంటర్వ్యూలో హైమ్‌ తెలిపారు. (చదవండి: 36 గ్రహాలపై మనలాగే మరికొం‍దరు!)

హైమ్ ఎషెడ్ ఇజ్రాయేల్‌ స్పేప్‌ సెక్యూరిటీ ప్రొగ్రామ్‌లో 1981-2010 వరకు పని చేశారు. ఇక అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఏలియన్స్‌ గురించి బయట ప్రపంచానికి తెలియజేయాలని తెగ ఉబలాటపడేవారని... కానీ గెలాక్సీ ఫెడరేషన్‌‌లోని ఏలియన్స్‌ ఆయనను ఆపాయన్నారు. ముందు జనాలు మా విషయంలో కనబరిచే ఆసక్తి తగ్గాక ఈ విషయాలను వెల్లడించాలని సూచించాయన్నారు. హెమ్‌ ఎషెడ్‌ మాట్లాడుతూ.. ‘వారు మాస్‌ హిస్టీరియా సృష్టించాలని అనుకోవడం లేదు. మనకు తగినంత సమయం ఇచ్చి వారి పట్ల మనం తెలివి, అవగాహన ఏర్పర్చుకోవాలని కోరుకుంటున్నారు’ అన్నారు. (చదవండి: ఆకాశంలో బ్లాక్‌ రింగ్‌.. ఏలియన్స్‌ వచ్చేశారు!)

హైమ్ ఎషెడ్ ఇజ్రాయెల్ యెడియోట్ అహరోనోట్తో మాట్లాడుతూ, గ్రహాంతరవాసుల ఉనికిని తాను నిరూపించగలనని, ఎందుకంటే వారు చాలా కాలం నుంచి మన మధ్య ఉన్నారని ఆయన పేర్కొన్నారు. గ్రహాంతర వాసులు సొంతంగా "గెలాక్సీ ఫెడరేషన్" అనే సంస్థను కలిగి ఉన్నారని తెలిపారు. మనుషులకు అంతరిక్షం, స్పేస్‌షిప్స్‌, ఏలియన్స్‌ పట్ల ఓ అవగాహన వచ్చే వరకు తమ ఉనికిని బహిర్గతం చేయాలని వారు భావించడం లేదని తెలిపారు.  ఎషెడ్ ఇంకా మాట్లాడుతూ, “అమెరికా ప్రభుత్వం, గ్రహాంతరవాసుల మధ్య ఒక ఒప్పందం ఉంది. ఇక్కడ ప్రయోగాలు చేయడానికి వారు మాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. వారు కూడా, విశ్వం మొత్తాన్ని పరిశోధించడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వారు మనల్ని సహాయకులుగా కోరుకుంటున్నారు. అంగారకుడి లోతులో భూగర్భ స్థావరం ఉంది, అక్కడ గ్రహాంతర వాసుల ప్రతినిధిలు, మన అమెరికన్ వ్యోమగాములు కూడా ఉన్నారు” అని తెలిపారు.

మరిన్ని వార్తలు