లాటరీలో లక్కీ చాన్స్‌! 150 కిలోల బరువు ఉండటంతో టికెట్‌ ఫ్రెండ్‌కు ఇచ్చి..

28 Jan, 2022 05:12 IST|Sakshi

కేప్‌ కానవెరల్‌: ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్పేస్‌ ఎక్స్‌ గతేడాది చేపట్టిన తొలి పౌర అంతరిక్షయానం ‘ఇన్‌స్పిరేషన్‌ 4’కు లాటరీలో టికెట్‌ గెలుచుకున్న వ్యక్తి దాన్ని తన స్నేహితుడికి ఇచ్చాడని తెలుసా? బరువు ఎక్కువున్నందు వల్ల స్పేస్‌లో ప్రయాణించే అవకాశాన్ని అతను కోల్పోయాడంటే నమ్ముతారా? అక్షరాలా నిజం. టికెట్‌ గెలుచుకున్న అసలు వ్యక్తి పేరు కైల్‌ హిప్చెన్‌. తన కాలేజీ స్నేహితుడు క్రిస్‌ సెంబ్రోస్కీకు ఆ టికెట్‌ను ఇచ్చాడు.

అలా స్నేహితుడికి టికెట్‌ ఇచ్చిన విషయాన్ని హిప్చెన్‌ ఎప్పుడో తన స్నేహితులు, బంధువులకు చెప్పినా ఇటీవలే ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసింది. ఫ్లోరిడాకు చెందిన ఎండీవర్‌ ఎయిర్‌ అనే విమానయాన సంస్థలో హిప్చెన్‌ కెప్టెన్‌గా పని చేస్తున్నాడు. 1990ల్లో ఏరోనాటికల్‌ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు క్రిస్‌ సెంబ్రోస్కీ, హిప్చెన్‌ కలిసి ఒకే రూమ్‌లో ఉన్నారు. అప్పటి నుంచి వీరికి పరిచయం ఉంది. తర్వాత కాలంలో హిప్చెన్‌ కెప్టెన్‌గా ఫ్లోరిడాలో, క్రిస్‌ డేటా ఇంజనీర్‌గా వాషింగ్టన్‌లో ఉంటున్నారు.

రూ. 48 వేలు పెట్టి లాటరీలో పాల్గొని..
స్పేస్‌ ఎక్స్‌ అంతరిక్షయానానికి సంబంధించిన ఓ సీటును ‘షిఫ్ట్‌4 పేమెంట్స్‌’ వ్యవస్థాపకుడు, సీఈవో జారెడ్‌ ఇసాక్‌మన్‌ కొనుగోలు చేశాడు. ఓ పిల్లల రీసెర్చ్‌ ఆస్పత్రి కోసం డబ్బులు పోగు చేయడానికి దాన్ని లాటరీ ద్వారా అమ్మతున్నట్టు ప్రకటించాడు. అది తెలుసుకున్న హిప్చెన్‌ రూ. 45 వేలు, క్రిస్‌ రూ. 3 వేలు కలిపి రూ. 48 వేలతో లాటరీలో పాల్గొన్నారు. 72 వేల మంది దరఖాస్తు చేసుకోగా ఫిబ్రవరిలో లాటరీ తీస్తే హిప్చెన్‌ పేరొచ్చింది. గెలిచిన వ్యక్తి 2 మీటర్ల లోపు పొడవు, 113 కిలోల వరకు బరువుండాలని స్పేస్‌ ఎక్స్‌ షరతు విధించింది. కానీ హిప్చెన్‌ 150 కిలోలున్నాడు. లాంచింగ్‌కు 6 నెలలుంది. బరువు తగ్గుదామనుకున్నాడు. కానీ ఒకేసారి అంత బరువు తగ్గడం మంచిదికాదని తెలుసుకున్నాడు. దీంతో తన స్నేహితుడు క్రిస్‌ సెంబ్రొస్కీని హిప్చెన్‌ ఎంచుకున్నాడు.

మరిన్ని వార్తలు