కరోనా: వైద్య నిపుణుల హెచ్చరికలు

28 Aug, 2020 21:18 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కోవిడ్‌-19 నిరోధక వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేంత వరకు మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, శానిటైజర్లు వాడటం  తదితర జాగ్రత్తలు తీసుకుంటూ.. వ్యాధి నిరోధక వ్యవస్థను పటిష్టం చేసుకోవడం ముందుకు సాగడమే ప్రస్తుతం మన ముందున్న మార్గం. అయితే మాస్కులు పట్ల ప్రజల్లో అవగాహన పెరిగినప్పటికీ, చాలా మంది భౌతిక దూరం పాటించడం లేదని, మాస్కు ఉందనే ధీమాతో ఎదుటి వ్యక్తులకు చేరువగా ఉండటం పట్ల వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల కరోనా వైరస్‌ తన రూపం మార్చుకుంటూ మరింత ప్రమాదకరంగా మారుతున్న వేళ.. మనిషికి, మనిషికీ మధ్య ఆరు ఫీట్ల కంటే ఎక్కువ దూరం ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఈ మేరకు బీఎంజే అనే మెడికల్‌ జర్నల్‌లో అంటువ్యాధి నిపుణులు పలు కీలక విషయాలు వెల్లడించారు. (చదవండి: మాస్కులతో పెరుగుతున్న నిర్లక్ష్యం)

కరోనా ఉధృతి పెరుగుతున్న వేళ ఇండోర్లు, వెలుతురు తక్కువగా ఉండే చోట్ల ఆరడగుల కంటే ఎక్కువ దూరం పాటించాలని సూచించారు. మాస్కు ధరించడం, బయట తిరుగుతున్న సమయం, జన సమూహ సాంద్రత, తదితర అంశాలు వైరస్‌ వ్యాప్తిలో ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ఈ విషయం గురించి వర్జీనియా టెఖ​ సివిల్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌ ప్రొఫెసర్‌ లిన్సే మార్‌ మాట్లాడుతూ.. ‘‘ఆరు ఫీట్ల దూరం పాటించడం బాగానే ఉంటుంది. అయినప్పటికీ వైరస్‌ సోకే ప్రమాదం ఉండదని కచ్చితంగా చెప్పలేం’’అని అభిప్రాయపడ్డారు. కాగా గాలి ద్వారా సోకే ఏదేని వైరస్‌ కణాలు కనీసం ఆరడగుల దూరం వరకు వ్యాప్తి చెందగలవని జర్మన్‌ బయోలజిస్టు కార్ల్‌ ఫ్లగ్‌ దాదాపు 200 ఏళ్ల క్రితం( 1800ల్లో) ఓ పరిశోధనలో భాగంగా వెల్లడించారు. అయితే ఆ తర్వాత కాలంలో ఈ విషయంపై పరిశోధనలు సాగించిన చాలా మంది శాస్త్రవేత్తలు ఆయన వాదనతో ఏకీభవించలేదు.(చదవండి: కరోనా కట్టడికి కిటికీలు తెరవాలి!)  

ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్సన్‌ సెంటర్లు కనీసం ఆరు ఫీట్ల దూరం పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం కనీసం ఒక మీటర్‌ లేదా మూడడుగులు దూరం పాటిస్తే సరిపోతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో కొన్ని దేశాల్లో కేవలం ఒకటిన్నర మీటర్లు(5 ఫీట్లు), మరికొన్ని దేశాల్లో ఆరున్నర ఫీట్ల దూరం పాటించాలని నిబంధనలు విధించాయి. ఇక ముఖానికి మాస్కులు ధరించడం అలవాటు చేసుకున్న ప్రజలంతా తమకు కరోనా సోకదనే ధీమాతో ఉన్నట్లు లండన్‌లోని వార్‌విక్‌ బిజినెస్‌ స్కూల్‌ ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ సామాజిక లేదా భౌతిక దూరం పాటించడానికి సుముఖంగా లేరని సర్వేలో తేలింది. దీంతో కరోనా వైరస్‌ రెండోసారి గనుక దాడి చేసినట్లయితే ప్రజలను భౌతిక దూరం పాటించేలా చేయడం చాలా కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు