పాక్‌ మసీదులో ఆత్మాహుతి దాడి.. 50 మంది మృతి.. 100 మందికిపైగా గాయాలు

31 Jan, 2023 05:57 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లోని పెషావర్‌లో సోమవారం ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. పోలీస్‌ లైన్స్‌ ప్రాంతంలోని మసీదులో ఈ పేలుడు సంభవించింది. మసీదులో మధ్యాహ్నం 1.45 గంటలకు జుహర్‌ ప్రార్థనల సమయంలో ఒక్కసారిగా భారీగా పేలుడు శబ్దం రావడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 50 మంది మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. 

మరో 100 మందికి తీవ్ర గాయాలవ్వగా.. క్షతగాత్రులను పెషావర్‌లోని లేడీ రీడింగ్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషయమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

పేలుడు దాటికి మసీదు పైకప్పు, ఓ వైపు గోడ భాగం కూలిపోయింది. భవన శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మ‌సీదులో ఓ వ్య‌క్తి త‌న‌తంట తాను పేల్చుకున్న‌ట్లు.. తొలి వ‌రుసలో ఉన్న వ్య‌క్తి ఆత్మాహుతికి పాల్ప‌డిన‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
చదవండి: Gunfire: బర్త్‌డే పార్టీలో కాల్పుల కలకలం.. 8 మంది మృతి..

మరిన్ని వార్తలు