నార్త్‌ కొరియాను భయపెడుతున్న కరోనా.. చేతులెత్తేసిన కిమ్‌..?

15 May, 2022 14:40 IST|Sakshi

Covid In North Korea.. ఉత్తరకొరియాలో కరోనా విలయతాండవం చేస్తోంది. కొద్దిరోజుల కిత్రం ఒమిక్రాన్‌ మొదటి కేసు నమోదు కాగా తాజాగా భారీ సంఖ‍్యలో పాజిటివ్‌ కేసులు పెరగడం నార్త్‌ కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్‌ ఉన్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.

అయితే, ఇప్పటివరకు వరకు నార్త్‌ కొరియాలో కరోనా వైరస్‌తో 42 మంది మృతి చెందినట్టు ఆ దేశ మీడియా కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ(KCNA) ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఈరోజు వరకు దేశంలో 8,20, 620 మందికి లక్షణాలు ఉండగా 3,24,550 మంది ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారని మీడియా పేర్కొంది. మరోవైపు ఆదివారం ఒక్కరోజే 15 మంది వైరస్ సోకి మృత్యువాతపడ్డారు. 

దీంతో అప్రమత్తమైన కిమ్‌ సర్కార్‌ దేశంలోని అన్ని ప్రావిన్స్‌లు, నగరాల్లో పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ విధించింది. వ్యాపార సముదాయాలు, పరిశ్రమలను సైతం మూసివేయాలని ఆదేశించింది. ఇక, ఉత్తరకొరియాలో ఇప్పటి వరకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభంకాలేదు. నార్త్‌ కొరియన్లు టీకా తీసుకోకపోవడంతో వైరస్‌ వ్యాప్తి వేగంగా జరుగుతోంది. అంతకుమందు ఉత్తరకొరియాకు డబ్ల్యూహెచ్‌వో, రష్యా, చైనాలు టీకాలను అందిస్తామని ఆఫర్‌ ఇచ్చినప్పటికీ కిమ్ జోంగ్‌ ఉన్‌ తిరస్కరించారు. దీంతో తాజాగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. 

మరోవైపు.. ఉత్తర కొరియాకు వ్యాక్సిన్‌లు పంపే ఉద్దేశ్యంలేదని అగ్రరాజ్యం అమెరికా తేల్చి చెప్పింది. గతంలో కోవాగ్జిన్‌కి చెందిన గ్లోబల్ వ్యాక్సిన్ షేరింగ్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన విరాళాలను ఉత్తరకొరియా పదేపదే తిరస్కరించిందని ఈ సందర్భంగా అమెరికా గుర్తు చేసింది. కానీ, ఉత్తరకొరియాకు మానవతా సాయం అందించే అంతర్జాతీయ ప్రయత్నాలకు మాత్రం తమ మద్దతు ఉంటుందని తెలిపింది. 

ఇది కూడా చదవండి: కాల్పులతో దద్దరిల్లిన అమెరికా.. 10 మంది మృతి

మరిన్ని వార్తలు