మాస్క్‌లాగా పెయింటింగ్‌.. దిమ్మతిరిగే షాకిచ్చిన అధికారులు

27 Apr, 2021 15:54 IST|Sakshi

మాస్క్‌లు ధరించడం.. భౌతిక దూరం పాటించడం...చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం.. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండడం... ఇవన్నీ కరోనా కట్టడికి మనం పాటిస్తున్న జాగ్రత్తలు. ఇందులో మాస్క్‌లు కీలకమైనవి. దేశంలో రోజురోజుకూ కరోనా సెకెండ్‌ వేవ్‌ కలకలం సృష్టిస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు మన దేశంలో నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా మాస్క్‌లను ధరించాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే మాస్క్‌ పెట్టుకోవడం అత్యంత అవసరమని ఎంత చెప్పినా కొందరు ఏమాత్రం లెక్కచేయడం లేదు. అందరూ ఉన్నప్పుడు మాస్క్‌ పెట్టుకోవడం, ఎవరూ చూడని సమయంలో తీసేయడం వంటి పనులు చేస్తున్నారు. అంతేగాక మాస్క్‌ ధరించినా ముక్కు కిందకే ఉంచడం వంటి వింత చేష్టలు చేస్తున్నారు.

తాజాగా ఇలాగే ఇండోనేషియాకు చెందిన ఓ యువతి మాస్క్‌ లేకుండా సూపర్‌ మార్కెట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. మాస్క్‌ లేకపోవడంతో సెక్యూరిటీ గార్డ్‌ అడ్డుకున్నాడు. దీంతో మాస్క్‌ కోసం వినూత్నంగా ఆలోచించిన యువతి  అచ్చం మాస్క్‌లాగా ముఖానికి పెయింటింగ్‌ వేసుకొని మరో వ్యక్తితోపాటు సూపర్‌మార్కెట్‌లోకి అడుగు పెట్టింది.  ముఖానికి మాస్కే అనుకొని సెక్యూరిటీ  కూడా ఆమెను లోపలికి వెళ్లనిచ్చాడు. అక్కడ జరిగేదంతా యువతి వీడియో తీసింది. అయితే ఈ వీడియో కాస్తా వైరల్‌ అవ్వడంతో సదురు యువతి మాస్క్‌కు బదులు పెయింటింగ్ చేయించుకోవడాన్ని గమనించారు. ఇది చట్ట విరుద్దమని నెటిజన్లు కామెంట్లు చేశారు. చివరికి ఆమె పనితనం అధికారుల దృష్టికి చేరింది. దీంతో కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు యువతి పాస్‌పోర్టును ఇమిగ్రేషన్‌ అధికారులు  రద్దు చేశారు. దీంతో ఆమెకు దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయినట్లైంది.

చదవండి: మాస్క్‌ పెట్టుకోలేదారా.. ఇన్‌స్పెక్టర్ చెంప చెళ్లుమనిపించాడు!

మరిన్ని వార్తలు