వెనుజులా అధ్యక్షుడి ఫేస్‌బుక్‌ ఖాతా నిలిపివేత..!

27 Mar, 2021 14:51 IST|Sakshi

కారకస్‌: తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు ఫేస్‌బుక్‌ తగు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఫేక్‌ న్యూస్‌, తప్పుడు సమాచారం ఇచ్చే వారిపై ఫేస్‌బుక్‌ ఉక్కుపాదం మోపుతోంది. అందులో భాగంగా  తప్పుడు సమాచారాన్ని ఫేస్‌బుక్‌లో  షేర్‌ చేసినందుకు గాను వెనుజులా అధ్యక్షుడి ఖాతాను ఫేస్‌బుక్‌ నిలిపివేసింది.  వెనుజులా అధ్యక్షుడు నికోలస్‌ మడురో , ఏలాంటి ఆధారం లేకుండా కోవిడ్‌-19ను నివారించే రెమిడీ గురించి షేర్‌ చేసినందుకు గాను ఫేస్‌బుక్‌ ఆయన ఖాతాను నిలిపివేసింది. నికోలస్‌ తన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా నుంచి కోవిడ్‌-19కు  సదరు మెడిసిన్‌ నయం చేస్తోందని పోస్ట్‌ చేశారు.

కాగా జనవరి నెలలో  ‘కార్వాటివిర్’ అనే మెడిసిన్‌తో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌ లేకుండా కరోనా వైరస్‌ను తగ్గించవచ్చునని మడురో పేర్కొన్నారు. ఈ మెడిసిన్‌ పనిచేస్తోందని వైద్యులు, శాస్త్రవేత్తలు ఎక్కడా నిర్ధారించలేదు.ఫేస్‌బుక్‌ పాలసీలకు వ్యతిరేకంగా ఉన్నందున నికోలస్‌ మడురో షేర్‌ చేసిన వీడియోను  తొలగించింది. వీడియోలో ఉన్న సమాచారానికి ఎలాంటి నిర్ధారణ లేకపోవడంతో పోస్ట్ ను తీసివేశామని ఫేస్‌బుక్‌ తెలిపింది. మరోవైపు ఫేస్‌బుక్‌ తన ఖాతాను నిలిపివేయడాన్ని నికోలస్‌ మడురో ఖండించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన ఆదేశాల ప్రకారం కోవిడ్‌-19పై తప్పుడు సమాచారం ఇచ్చే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని ఫేస్‌బుక్‌ ప్రతినిధి తెలిపారు. ప్రైవసీ పాలసీలకు వ్యతిరేకంగా ఫేస్‌బుక్‌లో  పోస్ట్‌ చేసిన వారికి ముందుగా సమాచారం ఇస్తామని పేర్కొన్నారు. తర్వాత వారిపై తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.  కాగా ప్రస్తుతం  వెనుజులాలో శుక్రవారం నాటికి మొత్తం 1,54,905 కరోనా కేసులు నమోదవ్వగా, మృతుల సంఖ్య 1,543గా ఉంది. తక్కువ సంఖ్యలో కోవిడ్‌ టెస్ట్‌లను  చేస్తోన్నందున​ కేసుల సంఖ్య తక్కువగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

చదవండి: ఫేస్‌బుక్‌లో ఆ రికమెన్‌డేషన్‌లుండవు...!

మరిన్ని వార్తలు